పెద్దపల్లి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడ్డ వ్యాపారుల వద్ద గల బంగారం ఛోరీకి గురయ్యింది. 

పెద్దపల్లి జిల్లా రామగుండం మాల్యాలపల్లి రైల్వేబ్రిడ్జ్ మూల మలుపు వద్ద నిన్న(మంగళవారం)బంగారు వ్యాపారులు ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురయిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రమాదంలో మృత్యువాతపడ్డ వ్యాపారుల వద్ద గల బంగారం ఛోరీకి గురయ్యింది. మృతుల వద్ద 5కిలోల 6వందల గ్రాముల బంగారం ఉండాలని మృతుల బంధువులు చెబుతుండగా ప్రమాదస్థలంలో పోలీసులకు కేవలం మూడున్నర కిలోల బంగారం మాత్రమే లభించింది. దీంతో పోలీసులు రాకముందే కిలోన్నర బంగారం ఛోరీకి గురయినట్లుంది.

ఈ బంగారం చోరీ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు రామగుండం సిఐ కరుణాకర్ రావు తెలిపారు. మృతదేహాలను, క్షతగాత్రులను హాస్పిటల్ కు తరలించిన అంబులెన్స్ సిబ్బందితో పాటు 108 సిబ్బందిని విచారిస్తున్నట్లు వెల్లడించారు. 

Video రామగుండం రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి... ఘటనాస్థలంలో కిలో బంగారం

రామగుండం మాల్యాలపల్లి రైల్వేబ్రిడ్జ్ మూల మలుపు వద్ద మంగళవారం తెల్లవారుజామున వేగంగా వెళుతున్న కారు అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న రాంబాబు, శ్రీనివాస్ అనే ఇద్దరు బంగారు వ్యాపారులు మృతి చెందారు. మరో ఇద్దరు వ్యాపారులు సంతోష్ కుమార్, సంతోష్ లు తీవ్రంగా గాయపడగా హాస్పిటల్ కు తరలించారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సంఘటన స్థలంలో కిలో బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వ్యాపారులు ఆంద్రప్రదేశ్ నరసరావుపేటకు చెందిన వారుగా గుర్తించారు. వీరు బంగారం అమ్మడానికి వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా వ్యాపారుల బంధువుల ఫిర్యాదు మేరకు ఛోరీకి గురయిన బంగారం గురించి విచారణ చేపట్టారు.