కస్టమ్స్ అధికారులు ఎంతగా నిఘా పెంచినా, కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసినా స్మగ్లర్లు వారి కన్నుకప్పి స్మగ్లింగ్‌ చేస్తూనే ఉన్నారు. ఇందుకోసం అక్రమమార్కులు కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తూనే ఉన్నారు.

తాజాగా శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో ఓ వ్యక్తి బంగారాన్నిస్మగ్లింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. ఖతార్ రాజధాని దోహా నుంచి హైదరాబాద్‌కు ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ విమానంలో వచ్చిన ప్రయాణికుడు బంగారాన్ని పేస్ట్‌గా మార్చి దానిని ప్యాంట్, లో దుస్తుల్లో చుట్టి అక్రమంగా తీసుకొచ్చినట్లు గుర్తించారు.

మొత్తం 1,164 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.37 లక్షలు ఉంటుందని భావిస్తున్నారు. సదరు ప్రయాణికుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.