హైదరాబాద్: వినాయక చవితి వచ్చిందంటే చాలు ఖైరతాబాద్ గణనాథుడు టక్కున గుర్తుకు వస్తాడు. ఖైరతాబాద్ గణేషుడు ఎంత ఫేమస్ గా చెప్పుకుంటారో అంతే ఫేమస్ భోలక్ పూర్ డివిజన్ లోని బంగారు లడ్డూ వేలం. 

ముషీరాబాద్ నియోజకవర్గం భోలక్ పూర్ డివిజన్ లో ప్రతీ ఏడాది బంగారు లడ్డూను వేలం వేయడం ఆనవాయితీగా కొనసాగుతోంది. శ్రీసిద్ధి వినాయక భగత్ సింగ్ యూత్ అసోషియేషన్ ఆధ్వర్యంలో వినాయక మండపాన్ని ఏర్పాటు చేస్తారు. అసోషియేషన్ నిర్వాహకులు బుధవారం స్వామివారి ప్రసాదం లడ్డూను వేలంపాట వేశారు. 

లడ్డూతోపాటు బంగారు లడ్డూను కూడా వేలంపాటలో ఉంచడం ఇక్కడి ప్రత్యేకత. అయితే ఈ ఏడాది రూ.5లక్షలు విలువ చేసే 123 గ్రాముల బంగారు లడ్డనూ వేలం పాట నిర్వహించారు నిర్వాహకులు. ఈ వేలంపాటలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 

స్థానిక ఫిష్ వ్యాపారి బైరు విష్ణుప్రసాద్ ఈ లడ్డూను రూ.7.56 లక్షలకు దక్కించుకున్నారు. గత ఏడాది వేలంపాటలో 120 గ్రాముల బంగారు లడ్డూను స్థానికుడు కె.భాస్కర్ రూ.8.1లక్షలకు సొంతగా చేసుకుంటే ఈ ఏడాది 123 గ్రాముల బంగారు లడ్డూ కేవలం రూ.7.56 లక్షలకే సొంతం చేసుకోవడం గమనార్హం. ఈ వేలం పాట కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజరయ్యారు.