Asianet News TeluguAsianet News Telugu

గోదావరిలో పెరుగుతున్న వరద.. భద్రాచలం వద్ద ఉగ్రరూపం.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక

గోదావరి నదిలో మళ్లీ వరద ఉధృతి పెరిగింది. ఎగువన కురుస్తున్న వర్షాలతో మంగళవారం సాయంత్రం నుంచి గోదావరిలో వరద ఉధృతి పెరిగింది. భద్రాచలం వద్ద గోదావరి మరోసారి ఉగ్రరూపం దాల్చింది. 

Godavari Floods water level increase flood alert issued at bhadrachalam and dhavaleswaram
Author
First Published Aug 17, 2022, 10:22 AM IST

గోదావరి నదిలో మళ్లీ వరద ఉధృతి పెరిగింది. ఎగువన కురుస్తున్న వర్షాలతో మంగళవారం సాయంత్రం నుంచి గోదావరిలో వరద ఉధృతి పెరిగింది. భద్రాచలం వద్ద గోదావరి మరోసారి ఉగ్రరూపం దాల్చింది. క్రమంగా నీటి మట్టం పెరుగుతోంది. నీటి మట్టం పెరగడంతో అక్కడ మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. బుధవారం ఉదయం 9 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో నీటి మట్టం 54.60 అడుగులకు చేరింది. అక్కడి నుంచి 15,08,617 క్యూసెక్కుల వరద దిగువకు ప్రవహిస్తోంది. 

అలాగే.. గోదావరి నదికి ఉపనది అయిన శబరికి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో అల్లూరి సీతారామ రాజు జిల్లాలోని చింతూరు, ఏటపాక, కూనవరం, వీఆర్‌ పురం, ఏలూరు జిల్లాలోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని చాలా గ్రామాలు వరద నీటిలో ఉన్నాయి. గ్రామాలన్నీ జలమయం కావడంతో ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి రవాణా నిలిచిపోయింది. ప్రధాన రహదారులైన నెల్లిపాక-భద్రాచలం, నెల్లిపాక-కూనవరం, కూనవరం-చింతూరు, కోతులగుట్ట-పాండ్రాజుపల్లి, కూనవరం-వీఆర్ పురం.. తదితర రహదారులపై వరదనీరు పొంగిపొర్లుతోంది.

తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద గోదావరిలో వరద ఉధృతి క్రమంగా పెరుగుతుంది. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక అమలులో ఉంది. కాటన్ బ్యారేట్ వద్ద గోదావరి నీటి మట్టం 14.8 అడుగులుకు చేరింది. డెల్టా కాల్వకు 10,800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సముద్రంలోకి 14.35 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కొనసీమ లంక గ్రామాలు ముంపులోనే ఉన్నాయి. దీంతో లంక వాసులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.  ధవళేశ్వరం వద్ద గోదావరి నీటి ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios