తల్లిదండ్రుల కళ్లెదుటే విద్యార్థిని ఆత్మహత్య

girl suicide in musheerabad
Highlights

ప్రేమ వ్యవహారమే కారణమా?

హైదరాబాద్ లో ఓ పాలిటెక్నిక్ విద్యార్థిని తల్లిదండ్రుల కళ్లముందే ఆత్మహత్యకు పాల్పడింది. వారు చూస్తుండగానే హాస్టల్ మూడో అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ముషీరాబాద్ లో కలకలం సృష్టించింది.

వివరాల్లోకి వెళితే...  పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం రొంపిగుంట గ్రామానికి చెందిన మహ్మద్ సనా పాలిటెక్నిక్ చదవడానికి హైదరాబాద్ కు వచ్చింది. ముషీరాబాద్ ప్రభుత్వ వసతి గృహంలో ఉంటూ పాలిటెక్నిక్ రెండో సంవత్సరం చదువుతోంది. 

అయితే సనా ఇక్కడ ఓ యువకుడిని ప్రేమిస్తున్నట్లు గ్రామంలో ఉన్నతల్లిదండ్రులకు ఎవరో సమాచారం ఇచ్చారు. దీంతో తమ కూతురిని మందలించి ఇంటికి తీసుకెళ్లేందుకు వారు ఇవాళ హాస్టల్‌కు వచ్చారు. తల్లిదండ్రులు తనను తీసుకెళ్లడానికి వచ్చారని తెలుసుకుని తీవ్ర మనస్థాపానికి గురైన సనా తల్లిదండ్రులు చూస్తుండగానే హాస్టల్ భవనం మూడో అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడింది.

దీంతో యువతి తీవ్ర గాయాలపాలైంది. తల్లిదండ్రులు సనా ను వెంటనే దగ్గర్లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే సనా చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందింది.

ఈ ఆత్మహత్య గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
 

loader