నిజామాబాద్: అభం శుభం తెలియని బాలికకు మాయమాటలు చెప్పి లోబర్చుకుని గర్భవతిని చేశాడు ఓ కామాంధుడు. చుట్టపుచూపుగా వెళ్లి బంధువుల అమ్మాయిపైనే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే... నవీపేట మండలంలోని యల్.కె. ఫారం గ్రామంలోని చుట్టాలింటికి కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డికి చెందిన యువకుడు వెళ్ళాడు. ఈ సమయంలోనే చుట్టాల  ఇంట్లో వున్న బాలిక అతడి కంట పడింది. ఆమెపై కన్నేసిన సదరు యువకుడు తరచూ ఆ ఇంటికి వెళుతూ బాలికతో పరిచయం పెంచుకున్నాడు. ఆ తర్వాత ప్రేమ పేరిట మాయమాటలు చెప్పి బాలికపై పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 

అయితే బాలిక ప్రవర్తనలో ఇటీవల మార్పు రావడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాలికకు ఆరోగ్య పరీక్షలు చేసిన డాక్టర్లు ఆమె గర్భవతి అని తేల్చారు. దీంతో తల్లిదండ్రులు నిలదీయగా బాలిక అసలునిజాన్ని బయటపెట్టింది. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితున్ని అరెస్ట్ చేశారు.