Asianet News TeluguAsianet News Telugu

అనాథను అమ్మఒడికి చేర్చిన టీవీషో... ఎనిమిదేళ్ల క్రితం తప్పిపోయి..తాజాగా ఇంటికి చేరిన బాలిక...

ఓ టీవీషో అనాథాశ్రయంలో ఉన్న ఓ అమ్మాయి జీవితాన్ని మార్చేసింది. తాను అనాథ కాదని.. తల్లిదండ్రులు, తోడబుట్టినవారు ఉన్నారని తెలుసుకుని ఆ చిన్నారి సంతోషంతో మునిగిపోయేలా చేసింది. అనాథను అమ్మఒడికి చేర్చింది. 

girl missing eight years ago reached her parents in hyderabad
Author
Hyderabad, First Published Jun 28, 2022, 9:24 AM IST

హైదరాబాద్ :  దాదాపు ఎనిమిది ఏళ్ల కిందట తప్పిపోయిన ఓ బాలిక సోమవారం తల్లిదండ్రుల వద్దకు చేరుకుంది. ఓ టీవీ కార్యక్రమం ఆ బాలిక పాలిట వరంలా మారి.. అనాథ జీవితానికి తెరపడింది. వివరాల్లోకి వెళితే.. ఈసీఐఎల్ కమల నగర్ కు చెందిన పిన్నమోని కృష్ణ, అనురాధ దంపతులకు నలుగురు కుమార్తెలు. వీరిలో ఇందూ, సింధు కవలలు. 2014లో వినాయక చవితి ఉత్సవాలకు వెళ్లిన సందర్భంగా ఇందూ అనే మూడున్నరేళ్ల కుమార్తె తప్పిపోయింది. ఆ సమయంలో ఆ పాపను ఓ మహిళ తీసుకు వెళ్లినట్లుగా సీసీటీవీలో కూడా ఫుటేజ్ లభించింది. దాంతో తల్లిదండ్రులు ఆ రోజు నుంచి చాలా ప్రాంతాల్లో అమ్మాయి కోసం వెతికారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. 

ఇటీవల ఓ టీవీ చానెల్ కార్యక్రమంలో ఆ పాప కనిపించడంతో తల్లిదండ్రుల  గుర్తించి.. తమ కూతురులాగానే ఉందని అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై ఆరా తీశారు. టీవీ కార్యక్రమంలో ఎవరెవరు పాల్గొన్నారు. ఎక్కడెక్కడి నుంచి వచ్చారు. అనే విషయాన్ని తెలుసుకున్నారు. ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా  బాలల సంరక్షణ కమిటీ అధికారులను కలిసి విషయం తెలిపారు. వారి సహాయంతో కిస్మిత్ పూర్ లోని చెరిస్ అనాథ బాలికల సంరక్షణ కేంద్రానికి చేరుకున్నారు.

పాతబస్తీలో దారుణం.. పురుటి నొప్పులతో ఆసుపత్రిలో చేరిన గర్భిణీ.. డీజే పెట్టి చిందులేసిన సిబ్బంది..

అక్కడ ఉన్న పిల్లల్లో తమ కుమార్తె ఉండటంతో తల్లిదండ్రులు గుర్తించి అధికారులకు తెలియజేశారు. దాంతో రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రంగారెడ్డి,  జిల్లా బాలల హక్కుల చైర్మన్ నరేందర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా బాలల సంరక్షణ అధికారి ప్రవీణ్ కుమార్, మహిళా శిశు సంక్షేమశాఖ అధికారులు తల్లిదండ్రుల వద్ద వివరాలను, ఆ బాలిక వివరాలను పరిశీలించారు. ఎనిమిదేళ్ల కిందట తప్పిపోయిన పాప, అనాధాశ్రమంలో ఉన్న పాప ఒక్కరే అని నిర్ధారణకు వచ్చారు. సోమవారం స్థానిక మధుర నగర్ లో ఉన్న రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ప్రధాన కార్యాలయంలో తల్లిదండ్రులకు తమ కుమార్తెను అప్పజెప్పారు.  తప్పిపోయిన తన కుమార్తె వద్దకు చేరడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios