Asianet News TeluguAsianet News Telugu

కరోనా : పోరాడి ఓడిన సంజన.. వారం వ్యవధిలో తల్లిదండ్రులు మృతి ! తమ్ముడితో సహా పాజిటివ్ బారినపడి...

కాళ్లు పట్టుకుంటా మా నాన్నని బతికించండి.. అంటూ కనిపించిన వైద్యుల అందరి కాళ్లావేళ్లా పడినా చివరకు నిస్సహాయ స్థితిలో రెండు రోజుల క్రితం తండ్రిని పోగొట్టుకున్న సంజన ఇప్పుడు తల్లినీ కోల్పోయింది. 

girl lost her father and mother due covid19 in hyderabad - bsb
Author
Hyderabad, First Published May 20, 2021, 12:30 PM IST

కాళ్లు పట్టుకుంటా మా నాన్నని బతికించండి.. అంటూ కనిపించిన వైద్యుల అందరి కాళ్లావేళ్లా పడినా చివరకు నిస్సహాయ స్థితిలో రెండు రోజుల క్రితం తండ్రిని పోగొట్టుకున్న సంజన ఇప్పుడు తల్లినీ కోల్పోయింది. 

మా అమ్మను బతికించండి సార్ అంటూ...  టిమ్స్ వైద్యులను వేడుకుంటే, మేం  చూసుకుంటాం.. అని చెప్పి పంపిన వైద్యులు కాసేపటికే మీ అమ్మ చనిపోయిందంటూ.. చావు కబురు చెప్పారు. 

ఆ యువతి వారం వ్యవధిలో తల్లిదండ్రులను పోగొట్టుకుని.. ఇపుడు తమ్ముడితో కలిసి కరోనా బారినపడి.. దయనీయ పరిస్థితుల్లో కరోనా తో పోరాడుతుంది. వివరాల్లోకి వెళితే హైదరాబాద్ కు చెందిన జగదీష్, గీతా దంపతులు. వీరికి సంజన, హనుమ అనే ఇద్దరు సంతానం. 

జ్వరంతో బాధపడుతున్న తల్లిని సంజన ఈ నెల 5న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కోవిడ్ పరీక్ష చేయించగా పాజిటివ్ వచ్చింది. వెంటనే ఆమెను కింగ్‌కోఠిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించింది. వైద్యులు ఆక్సిజన్‌ బెడ్‌పై చికిత్స అందించారు. రెండు రోజుల తర్వాత తండ్రికి కూడా పాజిటివ్ నిర్ధారణ కావడంతో అదే ఆసుపత్రిలో చేర్పించింది.

కొద్దిరోజులకు తండ్రి పరిస్థితి కూడా విషమించింది. ఆయనకు ఐసియు బెడ్ సమకూర్చేందుకు సంజన ఎంత ప్రయత్నించినా దొరకలేదు. అక్కడ కనిపించిన తెల్లకోటు వేసుకున్న ప్రతి ఒక్కరి కాళ్ళావేళ్ళా పడింది. చివరకు బెడ్‌ దొరకని దయనీయ పరిస్థితుల్లో ఆయన ఈనెల 13న మరణించారు.

తండ్రి చనిపోయిన అరగంటకే తల్లి గీతా పరిస్థితి విషమించింది. మరోపక్క తండ్రి మృతదేహం.. ఆ బాధను దిగమింగుకుని సంజన తల్లిని కింగ్ కోటి ఆస్పత్రి నుంచి కర్మాంఘాట్ బైరామల్ గూడా లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించింది. అక్కడ వైద్యులు గీత ను సరిగా పట్టించుకోకపోగా ఒక రోజుకి రెండు లక్షల బిల్లు వేశారు.

అసలే తండ్రిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న సంజన తల్లినైనా దక్కించుకోవాలనుకుంది. మంత్రి కేటీఆర్ వాట్సప్ నెంబర్ సంపాదించి నా తల్లి రక్షించండి అంటూ ఈ నెల 15న మెసేజ్ చేసింది. దీనికి ఓకే... అంటూ కేటీఆర్ రిప్లై ఇచ్చిన అరగంటకే సదరు ఆస్పత్రికి ఫోన్ వెళ్ళింది. అంతే కొద్ది సేపటికి ఆమె పై ఆస్పత్రి యాజమాన్యం మా పైన ఫిర్యాదు చేస్తా అంటూ విరుచుకు పడింది.

సదరు ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులు సరిగా చూడడం లేదని భావించిన తన తల్లిని సోమవారం రాత్రి 10 గంటల సమయంలో గచ్చిబౌలిలోని టిమ్స్ ఆస్పత్రికి తరలించింది. అక్కడా బెడ్స్‌ ఖాళీలేని పరిస్థితి... దీంతో వైద్యులు సోమవారం రాత్రి పదిగంటల నుంచి మంగళవారం రాత్రి 2 గంటల వరకు వీల్ చైర్ లోనే ఉంచి ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్‌పైనే గీతకు చికిత్స అందించారు.

‘ఏదైనా బెడ్‌ ఖాళీ కాగానే చేరుస్తాం. మీరు వెళ్లిపోండి. మేం చూసుకుంటాం’ అని వైద్యులు సంజనకు చెప్పారు. ఆ కొద్దిసేపటికి తల్లి చనిపోయినట్టు వైజాగ్ నుంచి ఫోన్ వచ్చింది. కాగా, ఇప్పుడు సంజన, తమ్ముడు హనుమ కూడా కోవిడ్ బారిన పడ్డారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios