ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన ప్రేమికుడు మోసం చేశాడని తెలిసి బాధపడింది. అతనికి దూరంగా ఉంటూ బతుకుతోంది. కానీ.... ఆమె ప్రేమికుడి ప్రస్తుత గర్ల్ ఫ్రెండ్ మాత్రం... ఈ అమ్మాయిని నానా రకాలు వేధించింది. ఈ వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర సంఘటన మియాపూర్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... వైజాగ్‌కు చెందిన మునివెంకట అంజలి ఉమామహేశ్వరి(23) అదే ప్రాంతానికి చెందిన జేజిబాబు ప్రేమించుకున్నారు.కొన్నాళ్ల తర్వాత జేజిబాబు మరో యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని తెలిసి అంజలి వైజాగ్‌లోని 4వటౌన్‌ పోలీస్ స్టేషన్‌లో మోసం చేశాడని ఫిర్యాదు చేసింది. 

అనంతరం ఉమామహేశ్వరి హైదరాబాద్ నగరానికి వచ్చి మియాపూర్‌ ఆల్విన్‌ కాలనీలో నివసిస్తున్న అక్క వద్ద ఉంటోంది. జేజిబాబు ప్రియురాలు వసుంధర అంజలికి ఫోన్‌చేసి మెసేజ్‌లు ద్వారా వేధిస్తోంది. మనస్తాపం చెందిన ఆమె శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. జేజిబాబు, అతడి కుటుంబసభ్యులతోపాటు వేధించిన యువతిపై మృతురాలి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.