ఆదిలాబాద్: తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. నార్నూర్ లోని పోలీసు స్టేషన్ క్వార్టర్స్ లో ఇందూరు వైష్ణవి అనే 15 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఎస్ హెచ్ఓ బి. శ్రీనివాస్ ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. 

ఇందూరు ఊశన్న ఏడాది కాలంగా స్థానిక పోలీసు స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. ఆయన భార్య వసంత. వారిది ఆదిలాబాద్. తన భార్య ఆదిలాబాద్ అంగన్ వాడీ విధులు నిర్వహిస్తోంది. కరోనా వైరస్ నేపథ్యంలో తన కూతురు వైష్ణవితో కలిసి స్థానిక పోలీసు క్వార్టర్స్ లో ఊశన్న నివాసం ఉంటున్నాడు. కూతురు ఆదిలాబాద్ లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది.

రెండేళ్లుగా తనకు అన్న వరుస అయిన యువకుడితో ప్రేమాయణం సాగిస్తోంది. అతను ఊశన్న తోడల్లుడి కుమారుడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు గతంలో వారిని మందలించారు. ఈ విషయంపై తరుచుగా గొడవలు జరుగుతుండేవి.

వైష్ణవికి కౌన్సిలింగ్ కూడా చేశారు. అయినా మార్పు రాలేదు. శుక్రవారం రాత్రి చాటింగ్ చేస్తుండగా గమనించిన తండ్రి వైష్ణవిని మందలించాడు. దాంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది. బాలిక మరణంపై తల్లి వసంత అనుమానం వ్యక్తం చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, ఉట్నూరు డీఎస్పీ ఉదయ్ రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.