ఇన్ స్టాలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఆ ప్రేమే నిజమని ఆ యువతి మోసపోయింది. ఇంట్లో పెద్దవాళ్లకు తెలీకుండా పెళ్లి పీటలు కూడా ఎక్కేసింది. కానీ.. ఆ తర్వాత తాను మోసపోయానన్న విషయం తెలిసింది. దీంతో.. కన్న వారికి కూడా తన ముఖం కూడా చూపించుకోలేకపోయింది. ఈ క్రమంలోనే ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర సంఘటన హైదరాబాద్ నగరంలోనే చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మీర్ పేటకు చెందిన ఐశ్వర్య(20) అనే యువతికి మియాపూర్ కు చెందిన మా రెడ్డి అశిర్(21) ఇన్ స్టాగ్రామ్ లో పరిచయం ఏర్పడింది. ఖైరతాబాద్ లోని ఓ ప్రైవేటు సంస్థలో టెలికాలర్ గా పనిచేసే అశిర్ స్నేహం.. ప్రేమ పేరుతో యువతికి దగ్గరయ్యాడు. గతేడాది ఫిబ్రవరి లో పెద్దలకు తెలీకుండా ఇద్దరూ ఓ గుడిలో పెళ్లి చేసుకున్నారు. 

నెలపాటు ఖైరతాబాద్ లో ఓ గది అద్దెకు తీసుకుని ఉన్నారు. అశిర్ ఉద్యోగం వదిలేయడమే కాకుండా యువతిని నిర్లక్ష్యం చేయడం మొదలుపెట్టాడు. ఆ విషయం తెలిసిన తల్లిదండ్రులు వచ్చి వారిని మందలించారు. ముందు జీవితంలో స్థిరపడాలని సూచించారు. కాగా.. ఈ క్రమంలో యువతి గర్భం దాల్చింది. అయితే..  బలవంతంగా అబార్షన్ చేయించాడు. దీంతో ఐశ్వర్య మరింత కుమిలిపోయింది.

ఈ క్రమంలో అశిర్ నుంచి దూరంగా వచ్చి.. వేరే ఇద్దరు అమ్మాయిలతో కలిసి పేయింగ్ గెస్ట్ గా ఉంటోంది. తమ విషయం ఏదో ఒకటి తేల్చాలంటూ ఇటీవల అశిర్ ఇంటికి వెళ్లి.. అతని తల్లిని నిలదీసింది. ఆమె కనీసం రెండు సంవత్సరాలైనా ఆగాలని సూచించారు. 

అయితే.. ఆమె అలా చెప్పడంతో.. మనస్థాపానికి గురైన ఐశ్వర్య ఆత్మహత్య చేసుకుంది. దానికి ముందు తండ్రికి, అశిర్ కి ఆమె సెల్ఫీ వీడియోలు కూడా పంపింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.