ప్రధాని సభలో గందరగోళం.. లైట్ టవర్ ఎక్కిన యువతి.. ఆమె ఏమన్నదంటే?(Video)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభలో గందరగోళం రేగింది. ఓ యువతి లైట్ టవర్ ఎక్కింది. దీంతో ప్రధాని మోడీ హైరానా పడ్డారు. వెంటనే ఆమె కిందికి దిగాలని పలుమార్లు విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో ఈ రోజు మాదిగ విశ్వరూప మహాసభకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరయ్యారు. ఆయన ఈ సభలో కీలక ప్రసంగం చేశారు. ఎస్సీ వర్గీకరణ పై త్వరలోనే కమిటీ వేస్తామని చెప్పారు. ఇక నుంచి మంద కృష్ణ మాదిగ ఉద్యమంలో తాను ఒకడిని అంటూ పేర్కొన్నారు. మంద క్రిష్ణ మాదిగ నాయకుడైతే తాను ఆయన అసిస్టెంట్ అని చెప్పుకొచ్చారు. ప్రధానమంత్రి మాట్లాడుతుండగానే సభలో కొన్ని సెకండ్ల పాటు గందరగోళం రేగింది.
ఓ యువతి వేగంగా లైట్ టవర్ ఎక్కడం ప్రారంభించింది. వైట్ డ్రెస్‌లో వెనుక బ్యాగ్ వేసుకుని ఉన్న ఆ యువతి ప్రధానమంత్రి ప్రసంగిస్తుండగా టవర్ ఎక్కింది. ప్రధానితో మాట్లాడటానికి ఆమె టవర్ ఎక్కింది. ఇంతలో ప్రధానమంత్రి మోడీ వెంటనే అలర్ట్ అయ్యారు. ఆమెను కిందికి దిగాల్సిందిగా కోరారు. పలుమార్లు విజ్ఞప్తి చేశారు. అలా చేయొద్దని, షార్ట్ సర్క్యూట్ అయ్యే ముప్పు ఉందని సూచించారు. చివరకు ఆమె టవర్ పై నుంచి కిందికి దిగింది.
Also Read: పోటీలో లేని ప్రజాశాంతి పార్టీ.. కానీ, ఆ ప్రచారం చేస్తానంటున్న కేఏ పాల్
ఆ తర్వాత టవర్ ఎక్కి దిగిన యువతి కొన్ని మీడియా చానెళ్లతో మాట్లాడినట్టు తెలిసింది. ఆమె ప్రధాని మోడీ సభను తీవ్రంగా వ్యతిరేకించింది. అసలు వర్గీకరణే అవసరం లేదని, దేశమంతా ఒక్కటిగా చేయాలని తెలిపింది. వీళ్లు కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టి ఘర్షణలు రేపుతున్నారని ఆగ్రహించింది. ప్రధానమంత్రి పైనా ఆమె తీవ్రంగా విమర్శలు చేసింది. అంతా సజావుగా సాగిన మోడీ సభలో ఆమె లైట్ టవర్ ఎక్కడం చర్చనీయాంశమైంది.