తెలంగాణలో బాలికలపై వరుసపెట్టి అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. హన్మకొండలో తొమ్మిది నెలల పసిపాపపై అత్యాచారం, హత్య ఘటన తర్వాత ఎన్నో సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.

తాజాగా ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న బాలికను బలవంతంగా ఎత్తుకెళ్లి అత్యాచారం చేశాడో వ్యక్తి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం మొగురాళ్లపల్లి అనే గ్రామానికి చెందిన కొండ్రు భాస్కర్.. మరుగుదొడ్ల నిర్మాణం నిమిత్తం బాలిక ఉంటున్న గ్రామానికి వచ్చాడు.

ఆమెపై కన్నేసిన అతను ఆదివారం రాత్రి నిద్రిస్తుండగా.. ఆమె నోరు నొక్కి.. సమీపంలోని జామాయిల్ తోటలోకి లాక్కెళ్లి అత్యాచారం చేశాడు. బాలిక తండ్రి సోమవారం దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

మరో ఘటనలో వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం భోజ్యానాయక్ తండాకు చెందిన ట్రక్యానాయక్‌కు ముగ్గురు భార్యలు ఉన్నారు. కొన్నేళ్ల క్రితం ఓ భార్య మరణించగా.. ఇద్దరు ఇంట్లో నుంచి వెళ్లిపోయారు.

అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్న ట్రక్యానాయక్‌ తన ఇంటి పక్కనే అమ్మమ్మ వద్ద ఉంటున్న ఓ బాలికపై కన్నేశాడు. ఈ నెల 19న సాయంత్రం పాఠశాల నుంచి వచ్చిన బాలికను తన దగ్గరకి పిలిచి తనకు గుట్కా ప్యాకెట్ తీసుకురావాలని కోరాడు.

అందుకు అంగీకరించిన బాలిక పక్కనే ఉన్న దుకాణం వద్ద గుట్కా ప్యాకెట్ తీసుకుని అతని ఇంటికి వెళ్లింది. ట్రక్యానాయక్ వెంటనే తలుపులు మూసి బాలికపై అత్యాచారం చేశాడు.

దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇక పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గాంధీనగర్‌ ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న చిన్నారి పట్ల స్కూలు అటెండర్ వికృత చేష్టలు చేశాడు.

ఈ నెల 22న ఆమె తండ్రి చిన్నారిని పాఠశాలలో దింపి వెళ్లాడు. అప్పటికి విద్యార్ధులెవరు రాకపోవడంతో ఆ చిన్నారి ఒంటరిగా ఉండటాన్ని గమనించి అటెండర్ సర్వర్ ఆమె ఓ గదిలోకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు.

సోమవారం చిన్నారి పాఠశాలకు వెళ్లేందుకు భయపడుతుండటంతో తల్లిదండ్రులు ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పాప తల్లిదండ్రులు, స్థానికులు పాఠశాలకు వచ్చి అటెండర్ సర్వర్‌ను చితకబాది పోలీసులకు అప్పగించారు.