సినీ హీరో తారకరత్నకు జీహెచ్ఎంసీ అధికారులు ఊహించని షాక్ ఇచ్చారు. బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12లోని తారకరత్నకు చెందిన డ్రైవ్ ఇన్ రెస్టారెంట్ ని కూల్చివేసేందుకు జీహెచ్ఎంసీ అధికారులు ప్రయత్నించారు.

అయితే ఎందుకు కూలుస్తున్నారంటూ జీహెచ్ఎంసీ అధికారులతో రెస్టారెంట్ నిర్వాహకులు వాగ్వాదానికి దిగారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నారని తమకు ఫిర్యాదు రావడంతో కూల్చడానికి వచ్చామని అధికారులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న తారకరత్న హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

తారకరత్న వెంటనే.. తనకు కొంత సమయం ఇవ్వాల్సిందిగా జీహెచ్ఎంసీ అధికారులను రిక్వెస్ట్ చేశారు. కాగా.. మూడు గంటల పాటు సమయం ఇచ్చారు. ఈ లోపుగా రెస్టారెంట్ సామాగ్రిని తరలించే పనిలో సిబ్బంది పడ్డారు.

కాగా.. డ్రైవ్‌ఇన్ రెస్టారెంట్‌ను నిబంధనలకు విరుద్ధంగా రెసిడెన్షియల్ ఏరియాలో నడుపుతున్నారని, రాత్రి వేళల్లో మద్యం తాగుతూ, డీజే సౌండ్స్‌తో న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారని ఎమ్మెల్యే కాలనీలోని సొసైటీ సభ్యులు జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రెస్టారెంట్ ని కూల్చేందుకు అధికారులు ప్రయత్నించినట్లు సమాచారం.