బీజేపీ కార్పొరేటర్ల తీరుపై జీహెచ్‌ఎంసీ మేయర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అధికారులకు సిగ్గు లేదా అని మాట్లాడతారా? అంటూ బీజేపీ కార్పొరేటర్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్: బీజేపీ కార్పొరేటర్ల తీరుపై జీహెచ్‌ఎంసీ మేయర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అధికారులకు సిగ్గు లేదా అని మాట్లాడతారా? అంటూ బీజేపీ కార్పొరేటర్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు జీహెచ్‌ఎంసీ సర్వసభ్య సమావేశం ప్రారంభం కాగానే సభలో తీవ్ర గందరగోళం చోటుచేసుకుంది. ప్రతిపక్ష బీజేపీ కార్పొరేటర్లు నిరసనకు దిగడంతో వారికి వ్యతిరేకంగా అధికార బీఆర్ఎస్ కార్పొరేటర్లు నినాదాలు చేశారు. దీంతో కౌన్సిల్ సమావేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే జల మండలి అధికారులు, జోనల్ కమిషనర్లు సమావేశాన్ని బాయ్‌కాట్ చేసి వెళ్లిపోయారు. అయితే అధికారులు జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశాన్ని బాయ్‌కాట్ చేయడం ఇదే తొలిసారి అని తెలుస్తోంది.
ఈ పరిణామాల నేపథ్యంలో మేయర్ విజయలక్ష్మి కార్పొరేటర్లు జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశాన్ని అర్దాంతరంగా వాయిదా వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మేయర్ విజయలక్ష్మి.. బీజేపీ కార్పొరేటర్లకు కాకుండా మిగిలిన కార్పొరేటర్ల పరిధిలో సమస్యలు లేవా? అని ప్రశ్నించారు. సమస్యలపై చర్చించకుంటే ఎలా పరిష్కారమవుతాయని మండిపడ్డారు.
జీహెచ్‌ఎంసీ సర్వసభ్య సమావేశం జరగాలనే ఉద్దేశం బీజేపీ కార్పొరేటర్లకు లేదని అన్నారు. తాను, అధికారులు అందరూ అక్కడ ఉన్నారని.. సమస్యలను ప్రస్తావిస్తే ఆన్సర్ చేయడానికి రెడీగా ఉన్నారని చెప్పారు. బీజేపీ కార్పొరేటర్లు ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
ప్రజాధనాన్ని బీజేపీ కార్పొరేటర్లు దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. సభ సజావుగా జరగాలని అధికారులను, పార్టీల ఫ్లోర్ లీడర్లను పిలిచి మాట్లాడనని చెప్పారు. అయితే బీజేపీ కార్పొరేటర్లకు రెండు నిమిషాలు కూడా ఓపిక లేకుంటే ఎలా అని ప్రశ్నించారు. ఇతర పార్టీ కార్పొరేటర్లతో వాగ్వాదానికి దిగడం ఎంతవరకు సమంజసం ఎలా అని ప్రశ్నించారు.
బీజేపీ కార్పొరేటర్ల తీరు బాగోలేదని కూడా జోనల్ కమిషనర్లు చెబుతున్నారని తెలిపారు. వారిని దూషిస్తున్నారని ఆవేదన చెందుతున్నారని చెప్పారు. బీజేపీ కార్పొరేటర్ల తీరును తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.
