ఇకపై హైదరాబాద్‌లో బహిరంగంగా ఉమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు. గుట్కాలు, పాన్‌లు, పొగాకు నమిలీ రోడ్లపై ఎక్కడపడితే అక్కడ ఉమ్మడం వల్ల ప్రజలు ఇబ్బంది పడటంతో పాటు నగరంలో అందం లోపిస్తుంది.

ఇటువంటి చర్యలపై విసుగుచెందిన టీఎస్ఎస్ ప్రసాద్ అనే వ్యక్తి బహిరంగంగా ఉమ్మి వేయటాన్ని నిషేధించాల్సిందిగా జీహెచ్ఎంసీ అధికారులకు ట్వీట్టర్ ద్వారా సూచించాడు. దీనిపై స్పందించిన జీహెచ్ఎంసీ అదనపు కమీషనర్ ముష్రాఫ్ ఫరూఖీ.. ఈ నిబంధనను అమలు చేయాలని జీహెచ్ఎంసీ ఎప్పటి నుంచో భావిస్తోందన్నారు.  

గతేడాది నవంబర్‌ నెలలో పుణే మున్సిపల్ కార్పోరేషన్ ఈ నిబంధనను అమలు చేసిందని.. నగర పరిసరాల్లో బహిరంగంగా ఉమ్మి వేయడం నిషేధించింది. ఒకవేళ ఎవరైనా దీనిని అతిక్రమించి రోడ్డుపై ఉమ్మి వేస్తే వారి చేత దానిని శుభ్రం చేయించడంతో పాటు రూ.100 జరిమానా విధించారు.

బహిరంగంగా ఉమ్మి వేయడంపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 25 మందిని పట్టుకున్నారు. వారితో రోడ్లు శుభ్రం చేయించి జరిమానా సైతం విధించారు. ప్రజల నుంచి ఆశించిన మార్పు రాకపోవడంతో పుణే మున్సిపల్ అధికారులు జరిమానా మొత్తాన్ని రూ.100 నుంచి రూ.150కి పెంచారు, అలాగే ఉమ్మి వేసిన వారు రోడ్లు శుభ్రం చేయడంలో ఎలాంటి మినహాయింపు ఇవ్వలేదు.

మరోవైపు బహిరంగంగా ఉమ్మి వేయడాన్ని నిషేధించే ప్రతిపాదనకు మద్ధతిస్తూ చాలామంది నెటిజన్లు ముందుకు వస్తున్నారు. అదనపు కమీషనర్ రీట్వీట్ చేసిన వెంటనే రోడ్లపై పాన్, గుట్కా ఉమ్మి వేసిన ఫోటోలను కొందరు పోస్ట్ చేశారు. పుణే నగరపాలక సంస్థ అనుసరించి విధానాన్ని హైదరాబాద్‌లోనూ అమలు చేస్తే బెటరని మరికొందరు అభిప్రాయపడ్డారు.

ముందుగా ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయాలని జీహెచ్ఎంసీ భావిస్తోంది. గతంలో కొన్ని ప్రాంతాల్లో బహిరంగంగా ఉమ్మి వేయడంపై స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించి బాధ్యులకు రూ.200 జరిమానా సైతం విధించింది. అలాగే బహిరంగ ప్రదేశాల్లో మూత్రవిసర్జనను నివారించేందుకు గాను నగరంలోని ఎంపిక చేసిన ప్రాంతాల్లో ప్రత్యేకంగా మూత్రవిసర్జన శాలలను నియమించింది.