Asianet News TeluguAsianet News Telugu

గ్రేటర్ ఎన్నికలు: చరిత్రలోనే తొలిసారి ఇలా...

1955లో ఎంసీహెచ్‌ ఏర్పడింది. అప్పటి నుంచి 1974 వరకు వరుసగా నాలుగు పాలకమండళ్లు కొలువుదీరాయి. 1969 పాలకమండలి 1974 వరకు ఉండగా.. అనంతరం 1986 వరకు ఎన్నికలు జరగలేదు. 

GHMC Elections: For The First Time In History, Elections Before End Of The Term SRH
Author
Hyderabad, First Published Oct 12, 2020, 1:20 PM IST

హైదరాబాద్‌ : పూర్వ ఎంసీహెచ్‌... ప్రస్తుత జీహెచ్‌ఎంసీ... 65 ఏళ్ల రెండు సంస్థల చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా గడువుకు ముందే ఎన్నికలు జరగునున్నాయి. పాలకమండలి గడువు ముగిసి నెలలు, ఏళ్ల తరబడి ప్రత్యేక అధికారి పాలన కొనసాగిన అనంతరం గతంలో ఎన్నికలు నిర్వహించేవారు. 

ఇప్పుడు అందుకు భిన్నంగా పాలకమండలి పదవీ కాలం ఉండగానే ఎన్నికల కసరత్తు మొదలైంది. ఇదంతా చట్టంలోని వెసులుబాటు ఆధారంగానే అయినప్పటికీ మహా నగరపాలక సంస్థలో ముందస్తు ఎన్నికలు కొత్తగా అనిపిస్తున్నాయని సీనియర్‌ అధికారులు అభిప్రాయపడుతున్నారు.

గతంలో ఇలా

1955లో ఎంసీహెచ్‌ ఏర్పడింది. అప్పటి నుంచి 1974 వరకు వరుసగా నాలుగు పాలకమండళ్లు కొలువుదీరాయి. 1969 పాలకమండలి 1974 వరకు ఉండగా.. అనంతరం 1986 వరకు ఎన్నికలు జరగలేదు. 

1969 వరకు కూడా పాలకమండలి గడువు ముగిసిన తర్వాతే ఎన్నికలు జరిగాయని, ముందు ఎప్పుడూ నిర్వహించలేదని జీహెచ్‌ఎంసీ అధికారొకరు తెలిపారు. 1974 నుంచి 86 వరకు దాదాపు 12 ఏళ్ల పాటు అప్పటి మునిసిపల్‌ కార్పొరేషన్‌లో ప్రత్యేక అధికారి పాలన కొనసాగింది. 1986లో తిరిగి ఎన్నికలు జరిగాయి. ఆ పాలకమండలి 1991 వరకు ఉంది. 

అనంతరం మరో 11 ఏళ్లు ప్రత్యేక అధికారి పాలన సాగింది. 2002లో తిరిగి ఎంసీహెచ్‌ ఎన్నికలు నిర్వహించగా అప్పుడు ఎన్నికైన పాలకమండలి 2007 వరకు కొనసాగింది. శివార్లలోని 12 మునిసిపాల్టీలను విలీనం చేస్తూ ఏప్రిల్‌ 16, 2007న జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేశారు. 

గ్రేటర్‌ ఏర్పాటు అనంతరం రెండేళ్లకు 2009లో ఎన్నికలు జరిగాయి. 2009 నుంచి 2014 వరకు పాలకమండలి కొనసాగింది. రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఏడాదిన్నర తర్వాత మళ్లీ 2016 ఫిబ్రవరి 2వ తేదీన ఎన్నికలు జరిగాయి. 2016 ఫిబ్రవరి 11న ప్రస్తుత పాలకమండలి కొలువుదీరింది. వీరి పదవీ కాలం ఫిబ్రవరి 10, 2021 వరకు ఉంది. 

కాగా.. నవంబర్‌ లేదా డిసెంబర్‌లోనే ఎన్నికల ప్రక్రియ ముగించే దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. జీహెచ్‌ఎంసీ యాక్ట్‌ ప్రకారం పాలకమండలి గడువు ముగిసే మూడు నెలల ముందు ఎన్నికల నిర్వహణకు అవకాశం ఉంది. ఈ వెసులుబాటు ఆధారంగానే చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ముందస్తు ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం మొగ్గుచూపుతోందని ఓ అధికారి చెప్పారు.
 

రద్దు చేస్తారా...? కొనసాగిస్తారా...?

నవంబర్‌ 10 నాటికి ప్రస్తుత పాలకమండలి గడువు మూడు నెలలు ఉంటుంది. ఆ తర్వాతే గ్రేటర్‌ ఎన్నికల షెడ్యూల్‌ నోటిఫికేషన్‌ వెలువడుతుందన్న సంకేతాలు ఇప్పటికే వెలువడ్డాయి. చట్టంలోని వెసులుబాటు ఆధారంగా మూడు నెలల ముందు ఎన్నికల ప్రక్రియ ప్రారభమవుతున్నప్పటికీ కొత్త పాలకమండలి ఎప్పుడు కొలువుదీరుతుందన్నది చర్చనీయాంశంగా మారింది. 

ఎన్నికలు ముందు జరిగినా... నిర్ణీత కాల వ్యవధి పాటు ప్రస్తుత పాలకమండలి కొనసాగే అవకాశం ఉంది. ఆ తరువాత కొత్తగా ఎన్నికైన సభ్యులు ప్రమాణ స్వీకారం చేయవచ్చు. మూడు నెలల ముందు ప్రస్తుత పాలకమండలిని రద్దు చేసే అధికారమూ ప్రభుత్వానికి ఉందని అధికారులు చెబుతున్నారు. 

సర్కారు ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత పాలకమండలిని రద్దు చేసి ఎన్నికలకు వెళ్తుందా..? లేక యథావిధిగా ప్రభుత్వం కొనసాగిస్తుందా..? అన్నది తేలాల్సి ఉంది. 13, 14 తేదీల్లో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. 

గ్రేటర్‌ పాలకమండలి రద్దుకు సంబంధించి చట్ట సవరణకూ అసెంబ్లీలో ఆమోదం తెలిపే అవకాశం లేకపోలేదని ఓ అధికారి చెప్పారు. పాలకమండలి రద్దు చేసిన పక్షంలో కొత్త పాలకమండలి కొలువుదీరే వరకు ప్రత్యేక అధికారి పాలన కొనసాగుతుంది.

Follow Us:
Download App:
  • android
  • ios