హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ (జిహెచ్ఎంసీి) ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత, ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైఖరి ఏమిటనే ఉత్కంఠ నెలకొని ఉంది. గత ఎన్నికల్లో వైసీపీ పోటీ చేయలేదు. కానీ, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)కి సహకరించింది. హైదరాబాదులో రాయలసీమ, కోస్తాంధ్ర ఓటర్లు దండిగానే ఉన్నారు. 

గత ఎన్నికల కన్నా ఈసారి ఎన్నికలు భిన్నమైన ఎజెండాతో జరిగే అవకాశం ఉంది. టీడీపీకి బలమైన క్యాడర్ అంటూ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓటర్లు ఆ పార్టీకి సహకరిస్తారని భావించారు. కానీ, వారితో గత ఎన్నికల్లో కేటీఆర్ వరుస సమావేశాలు నిర్వహిస్తూ వారికి భరోసా ఇస్తూ వచ్చారు అంతేకాకుండా వైసీపీ టీఆర్ఎస్ కు సహకరించింది. దీంతో టీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ స్థానికులైన హైదరాబాదు ఓటర్లు టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారు. 

Also Read: హరీష్ రావు ఖాతాలో దుబ్బాక ఓటమి: జిహెచ్ఎంసీ ఎన్నికలు కేటీఆర్ కు అగ్నిపరీక్ష

టీడీపీ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటోంది. ఎన్ని సీట్లకు పోటీ చేస్తుందనేది చూడాల్సి ఉంది. మరో పార్టీతో పొత్తు ఉండే అవకాశాలు మాత్రం లేదు. జనసేన కూడా పోటీకి సిద్ధపడుతుంది. ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేసే అవకాశాలు లేకపోవచ్చు. జాతీయ స్థాయిలో జనసేనకు బిజెపితో పొత్తు ఉంది. కానీ హైదరాబాదు ఎన్నికల్లో మాత్రం పొత్తు పెట్టుకోవడం లేదు. 

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేయాలని వైసీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయాన్ని వైఎస్ జగన్ కు చెప్పడానికి ఆయన సిద్ధపడుతున్నారు. అయితే, పోటీ చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకోవడానికి తగిన సమయం ఆ పార్టీకి ఉన్నట్లు కనిపించడం లేదు. దీంతో పోటీకి దూరంగానే ఉండవచ్చునని అంటున్నారు. 

అయితే, కేసీఆర్ కూ జగన్ కూ మధ్య సత్సంబంధాలే ఉన్నాయి. కేటీఆర్ కూ జగన్ కూ మధ్య స్నేహం కూడా ఉంది. ఈ స్థితిలో జగన్ టీఆర్ఎస్ కు సహకరించవచ్చుననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే సమయంలో కేంద్రం పెద్దలతో జగన్ స్నేహపూర్వక వాతావరణాన్నే కోరుకుంటున్నారు. బిజెపి టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధపడుతోంది. ఈ స్థితిలో జగన్ పూర్తి స్థాయిలో టీఆర్ఎస్ కు సహకరిస్తారా, లేదా అనేది చూడాల్సి ఉంది. 

Also Read: జిహెచ్ఎంసీ ఎన్నికలు: పవన్ కల్యాణ్ కు బండి సంజయ్ షాక్

మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీతో జగన్ కు మంచి సంబంధాలే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఓవైసీ జగన్ కు పూర్తిగా సహకరించారు టీఆర్ఎస్, మజ్లీస్ అవగహనతో హైదరాబాదు ఎన్నికల్లో పోటీ చేయనున్నాయి. ఇప్పటికే కేసీఆర్ అసదుద్దీన్ తో సమావేశమై ఆ విషయంపై చర్చించారు. ఆ స్థితిలో జగన్ తటస్థ వైఖరి తీసుకున్నా ఆశ్చర్యం లేదు. అప్పుడు వైసీపీ క్యాడర్ ఏం చేస్తుందనేది కూడా చూడాల్సి ఉంది.