హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ అసంతృప్త పార్లమెంటు సభ్యుడు డి. శ్రీనివాస్ పార్టీ తీరుపై షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. నగరాన్ని అబివృద్ధి చేస్తామనే నిబద్ధతను ప్రకటించే వారికే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటు వేయాలని ఆయన ప్రజలకు సూచించారు. టీఆర్ఎస్ కు ఓటు వేయాలని  డిఎస్ చెప్పకపోవడం గమనార్హం. 

జిహెచ్ఎంసీ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్దంగా జరగాలని ఆయన అన్నారు. గ్రేటర్ ఎన్నికలను ఓ జమ్మిక్కుగా చేస్తున్నారని ఆయన అన్నారు. ప్రజల్లో విశ్వసనీయత పెంచుకోవాలని ఆయన గురువారం మీడియా సమావేశంలో అభిప్రాయపడ్డారు. హైదరాబాదులో రూ.68 వేల కోట్లతో చేసిన అభివృద్ధి ఎక్కడ కనిపిస్తోందని ఆయన ప్రశ్నించారు. 

కాంగ్రెసు ప్రభుత్వ హయాంలో ఫ్లై ఓవర్లు నిర్మించారని, ఇప్పుడు వాటి నిర్వహణ కూడా సరిగా లేదని ఆయన అన్నారు. కేసీఆర్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని, కేసీఆర్ రాష్ట్రం గురించిన కన్నా కేంద్రం గురించే ఎక్కువ ఆలోచన చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. 

ఇటీవల జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలో అక్కడి ప్రజల నిర్ణయం చూశామని అంటూ టీఆర్ఎస్ పనిచేస్తే ప్రజల్లో ఎందుకు వ్యతిరేకత వస్తుందని ఆయన అడిగారు. టీఆర్ఎస్ తనను మరిచిపోయిందని ఆయన ప్రశ్నకు జవాబుగా చెప్పారు.