హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. రామచంద్రాపురం కార్పోరేటర్ అంజయ్య యాదవ్ ఈ రోజు గురువారం ఉదయం బిజెపిలో చేరారు. సాయంత్రానికి తిరిగి తన సొంత గూడు టీఆర్ఎస్ లోకి వచ్చారు. 

అంజయ్య యాదవ్ తిరిగి టీఆర్ఎస్ లోకి రావడంపై మంత్రి హరీష్ రావు పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి నివాసంలో మీడియా సమావేశంలో స్పందించారు. తొంట అంజయ్య యాదవ్ ను తిరిగి సొంత గూటికి ఆహ్వానించినట్లు ఆయన తెలిపారు. 

తమ టీఆర్ఎస్ క్రమశిక్షణకు మారు పేరు అని, టికెట్ ఆశించిన ప్రతి ఒక్కరు కూడా పార్టీపై గౌరవంతో ఉన్నారని ఆయన చెప్పారు టీఆర్ఎస్ లో టికెట్లు ఆశించినవారు ఎక్కువగా ఉండడం వల్ల కొంత ఇబ్బంది ఏర్పడిందని ఆయన అన్నారు. ప్రస్తుతం టికెట్ ఆశించినవారందరికీ మంచి అవకాశాలు కల్పిస్తామని హరీష్ రావు చెప్పారు. 

ఈ దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను బిజెపి కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ పరం చేసే ప్రయత్నం చేస్తోందని ఆయన అన్నారు. బీహెచ్ఈఎల్ ను నిలబెట్టింది తమ ప్రభుత్వమేనని ఆయన అన్నారు. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కార్మికులను రోడ్డున పడవేస్తోందని అన్నారు. 

ఏది ఏమైనా ఈ మూడు డివిజన్లలో తమ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని హరీష్ రావు చెప్పారు. ఈ ప్రాంత అభివృద్ది కోసం నిరంతరం పనిచేస్తున్న టీఆర్ఎస్ కు ప్రజలు పట్టం కడుతారని ఆయన అన్నారు. కాంగ్రెసు, బిజెపిలు ఎన్నికల కోసం మాత్రమే ప్రజల వద్దకు వస్తున్నాయని ఆయన విమర్శించారు.