జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చాలా విచిత్రాలు చోటుచేసుకున్నాయి. ఓ డివిజన్ లో తల్లిపై కొడుకు విజయం సాధించాడు. హయత్‌నగర్‌ సర్కిల్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ముద్దగౌని లక్ష్మీప్రసన్నగౌడ్‌ ఓటమి ఆసక్తికరంగా మారింది. కుమారుడే తల్లి ఓటమికి కారణమై ఆమె రాజకీయ జీవితానికి ప్రశ్నగా మారాడు. 

బీఎన్‌రెడ్డినగర్‌ డివిజన్‌లో లక్ష్మీప్రసన్నగౌడ్‌ ఉదయం నుంచి బీజేపీ అభ్యర్థిపై 1206 ఓట్లలీడ్‌లో కొనసాగారు. సాయంత్రం వరకు ఫలితాలన్నీ తారుమారయ్యాయి. బీజేపీ అభ్యర్థి మొద్దు లచ్చిరెడ్డి చేతిలో 32 ఓట్ల స్వల్ప మెజార్టీతో ఓటమిపాలయ్యారు. డమ్మీ అభ్యర్థిగా బరిలోకి దిగిన లక్షీప్రసన్నగౌడ్‌ కుమారుడు రంజిత్‌గౌడ్‌ ఈ ఓటమికి కారణంగా నిలిచారు. 

స్వతంత్ర అభ్యర్థి రంజిత్‌గౌడ్‌కు 39 ఓట్లు పోలయ్యాయి. ఆయన ముందే విత్‌ డ్రా చేసి ఉంటే బ్యాలెట్‌ పత్రంలో ఆయన పేరు కన్పించేది కాదు. రంజిత్‌కు పోలైన ఓట్లు టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి పడే అవకాశముండేదని విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా.. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఇలాంటి ఘటనలు చాలానే చోటు చేసుకొని ఉన్నాయని తెలుస్తోంది.