జీహెచ్ఎంసీ పోలింగ్ లో భాగంగా సంగారెడ్డిలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. భారతి నగర్‌ డివిజన్‌ ఎల్‌ఐజీ కాలనీలో సొసైటీ ఆఫీస్‌ 111వ నెంబర్‌ బూత్‌ వద్ద ఉద్రిక్తత నెలకొంది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సింధు ఆదర్శ్‌ రెడ్డి ఫోటోతో ఉన్న పోలింగ్‌ స్లిప్‌లను పంపిణీ చేస్తున్నారు. దీనిమీద బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. 

పోలీసులు, ఎన్నికల సిబ్బంది టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తూన్నారంటూ ఆరోపించారు. దీంతో ఇరు వర్గాల కార్యకర్తల మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. ఇక పటాన్ చెరు డివిజన్ లో బీజేపీ కార్యకర్తపై ఎమ్మెల్యే కుమారుడు చేయిచేసుకున్నాడు. 

పటాన్‌చెరు డివిజన్‌లోని చైతన్య కాలనీ పోలింగ్ బూత్ వద్ద బీజేపీ కార్యకర్త నర్సింగ్‌పై పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తనయుడు విష్ణు వర్ధన్ రెడ్డి చెయ్యిచేసుకున్నారు. విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో ఎమ్మెల్యే సతీమణి కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డిని అక్కడనుంచి తీసుకెళ్ళింది. 

సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని గొడవ జరగకుండా ఆపారు. బీజేపీ కార్యకర్త నర్సింగ్‌ను పటాన్‌చెరు  పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి విచారిస్తున్నారు. చెదురు మదురు సంఘటనలు మినహా పోలింగ్ ఇప్పటికి ప్రశాంతంగా కొనసాగుతోంది.