హైదరాబాద్: తెలంగాణ సెంటిమెంట్ ఇక ఎంత మాత్రమూ తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర రావుకు కలిసి వచ్చే అవకాశాలు లేవు. తెలంగాణ సెంటిమెంట్ కు చెల్లుచీటి పడినట్లే. ఈ విషయం దుబ్బాక శాసనసభ ఉప ఎన్నికల ఫలితంతో కొంత మేరకు నిర్ధారణ కాగా, జిహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలతో అది పూర్తిగా రుజువైంది. తెలంగాణ ప్రయోజనాలను పరిరక్షించే పెద్దన్నగా ఇక ఎంత మాత్రమూ కేసీఆర్ నిలిచే అవకాశాలు లేవు.

గత శాసనసభ ఎన్నికల్లో చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీతో కాంగ్రెసు పొత్తు పెట్టుకోవడం వల్ల తెలంగాణ సెంటిమెంట్ టీఆర్ఎస్ కు కలిసి వచ్చింది. టీడీపీ, కాంగ్రెసు కూటమి గెలిస్తే చంద్రబాబు ఆధిపత్యమే తెలంగాణలో కొనసాగుతుందని టీఆర్ఎస్ బలంగా ప్రచారం చేసింది. దానికితోడు, తెలంగాణ మేధావులు, రచయితలు, కళాకారులు కూడా ఆ దిశగా ప్రచారం చేసి టీఆర్ఎస్ కు ప్రయోజనం చేకూర్చారు. 

గ్రేటర్ ఎన్నికల్లో ఆ పప్పులు ఉడకలేదు. చివరగా తెలంగాణ కవులు, కళకారులు, చిత్రకారులు, సృజనకారులు ఓ ప్రకటన విడుదల చేశారు. బిజెపికి ఓటు వేయవద్దని పరోక్షంగా విజ్ఞప్తి చేస్తూ ఆ ప్రకటన వెలువడింది. హైదరాబాదులో మతవిద్వేషానికి తావు లేదని, గంగాజమున తేహజీబ్ ను కాపాడుకుందామని వారు పిలుపునిచ్చారు. పరోక్షంగా టీఆర్ఎస్ కు ఓటేయాలని పిలుపునిచ్చారు. గతంలో అయితే ఇటువంటి ప్రకటనలు ఏదో మేరకు ప్రజల మనసులను మార్చాయి. కానీ, ఈసారి పనిచేయలేదు. ఆ ప్రకటన విడుదల చేసినవారంతా ప్రభుత్వం నుంచి ఏదో రీతిలో ప్రయోజనం పొందినవారే. 

ప్రభుత్వం కడగంటి చూపునకు కూడా నోచుకోని ఆ వర్గాలు టీఆర్ఎస్ కు దూరమయ్యాయి. టీఆర్ఎస్ పక్కా రాజకీయ పార్టీగా మారిందని కేసీఆర్ స్వయంగా చెప్పారు. అది తెలంగాణ పార్టీగా కాకుండా పక్కా రాజకీయ పార్టీగా మారిందని చెప్పడానికి గత ఏడేళ్లలో జరిగిన పరిణామాలే నిదర్శనంగా నిలుస్తాయి.

తెలంగాణ ఉద్యమానికి, ఉద్యమకారులకు వ్యతిరేకంగా పనిచేసినవారనందరినీ కేసీఆర్ చేరదీశారు. పార్టీలోనూ ప్రభుత్వంలోనూ వారిదే పైచేయిగా మారింది. సనీరంగం, మీడియా వంటి పలు రంగాల్లో ఉద్యమకాలంలో ఆంధ్ర ఆధిపత్యాన్ని తెలంగాణ ఉద్యమకారులు ప్రశ్నిస్తూ వచ్చారు. కానీ, కేసీఆర్ ఆ ఆధిపత్యాలను నిలబెడుతూ వచ్చారు. సినీ రంగానికి సంబంధించి ఉదాహరణ తీసుకుంటే, జిహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న సమయంలో కేసీఆర్ తో చిరంజీవి, తదితర సినీరంగ ప్రముఖులు భేటీ అయ్యారు. వారి కోర్కెలను కేసీఆర్ పెద్ద మనసుతో తీర్చడానికి ముందుకు వచ్చారు. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. అన్ని రంగాల్లోనూ అదే కొనసాగుతూ వస్తోంది. 

ఉద్యమకాలంలో ఉద్యమం కోసం పనిచేసినవారిని పక్కన పెట్టి, తన కోసం పనిచేసినవారికి మాత్రమే కేసీఆర్ ప్రాధాన్యం ఇచ్చారు. తన కోసం పనిచేసివనవారికి పదవులు, బహుమతులు, అవార్డులు, రివార్డులు కట్టబెట్టారు. తాజా ఎమ్మెల్సీ ల నామినేషన్ విషయాన్ని కూడా అందుకు ఊదాహరణగా తీసుకోవచ్చు. ఇలా చేయడంలో మెజారిటీ వర్గం కేసీఆర్ కు దూరమైంది. 

తెలంగాణ సెంటిమెంట్ ను రద్దు చేస్తూ తెలంగాణ పెద్దన్నగా నిలబడేందుకు కేసీఆర్ ప్రయత్నాలు సాగించారు. బంగారు తెలంగాణ పేరుతో ఆయన తెలంగాణ ఉద్యమంలో పనిచేసినవారిని దూరం చేసుకున్నారు. ఈ క్రమంలో టీడీపీని, కాంగ్రెసును వలసలను ప్రోత్సహించడం ద్వారా చావుదెబ్బ తీశారు. అయితే, బిజెపి విషయంలో మాత్రం కేసీఆర్ అంచనా తప్పుగా తేలింది. బిజెపికి తెలంగాణలో స్థానం ఉండదని ఆయన అంచనా వేసుకున్నారు. ఆ అంచనాలను తలకిందులు చేస్తూ బిజెపి టీఆర్ఎస్ కు సవాల్ విసిరే స్థితికి చేరుకుంది. 

ఇక ముందు జరిగే ప్రతి ఎన్నికల సమరంలోనూ బిజెపితో హోరాహోరీ తలపడాల్సిన పరిస్థితే టీఆర్ఎస్ కు ఉంటుంది. ఈ స్థితిలో తెలంగాణ సెంటిమెంట్ పూర్తిగా మాయమై సాధారణ పార్టీల ఎత్తుగడలు, వ్యూహాలు మాత్రమే పనిచేస్తాయి. తెలంగాణ ఉద్యమ కాలంలోనూ ఆ తర్వాత గత శాసనసభ ఎన్నికల వరకు కేసీఆర్ నుంచి ప్రయోజనం పొందిన వివిధ వర్గాల నాయకత్వాలు నిర్వీర్యమయ్యాయి. ఈ నాయకత్వాలను వారి వెనక ఉద్యమకాలంలో నడిచినవారు విశ్వసించే పరిస్థితి పూర్తిగా పోయింది. వలసల ద్వారా బిజెపిని నిర్వీర్యం చేసే అవకాశం కూడా కేసీఆర్ కు ఉండదు. నిబద్ధత గల కార్యకర్తలు, నాయకుల పార్టీగా బిజెపి నుంచి వలసలు జరగడం దుర్లభమే అవుతుంది. కేసీఆర్ వ్యతిరేక శక్తులన్నీ బిజెపి వెనక నడవడం కూడా అనివార్యం కావచ్చు.