హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నాయకత్వంలోని జనసేనతో పొత్తు విషయంలో బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ వెనక్కి తగ్గలేదు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేనతో పొత్తు ఉండదని బండి సంజయ్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు పొత్తు పెట్టుకునేందుకు బిజెపి సిద్ధపడుతున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని బండి సంజయ్ తాజా ప్రకటన స్పష్టం చేస్తోంది.

పవన్ కల్యాణ్ తో భేటీకి బండి సంజయ్ వస్తున్నారంటూ జనసేన ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో బండి సంజయ్ తన ప్రకటన ద్వారా జనసేనకు తిరుగులేని షాక్ ఇచ్చారు.  

ఈ నేపథ్యంలో బండి సంజయ్ తో పాటు మరికొంత మంది బిజెపి నేతలు పవన్ కల్యాణఅ తో సమావేశమవుతారని భావించారు. బిజెపి ఇప్పటి వరకు 25 డివిజన్లకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించింది. బిజెపి పొత్తుకు సిద్ధంగా లేకపోవడంతో పవన్ కల్యాణ్ తన జనసేన పార్టీ అభ్యర్థులను పోటీకి దించడానికి సిద్ధపడ్డారు. 

జనసేనతో పొత్తుకు సిద్ధపడుతున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో బండి సంజయ్ స్పష్టత ఇచ్చారు. జనసేనతో పొత్తు ప్రతిపాదన లేదని ఆయన స్పష్టం చేశారు. తమ అభ్యర్థుల జాబితా సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. పవన్ కల్యాణ్ తో తనకు సత్సంబంధాలు ఉన్నాయని ఆయన చెప్పారు. ఎవరి మధ్యవర్తిత్వం కూడా అవసరం లేదని బండి సంజయ్ చెప్పారు.

కాగా, జిహెచ్ఎంసీ ఎన్నకిల్లో బహుముఖ పోటీ జరిగే అటవకాశం ఉంది. టీడీపీ కూడా 80కి పైగా స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధపడుతోంది. వామపక్షాల కూటమి కూడా తన అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. కాంగ్రెసు అన్ని స్థానాలకు పోటీ చేసే అవకాశం ఉంది. మరో వైపు మజ్లీస్, టీఆర్ఎస్ లు పోటీ చేస్తున్నారు. మజ్లీస్ తో పొత్తు ఉండదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు.