హైదరాబాద్: ఇతర పార్టీల్లో అసంతృప్తితో ఉన్న నాయకులకు తెలంగాణ బిజెపి గాలం వేస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాషాయం జెండా ఎగురేయాలని ఉవ్విళ్లూరుతున్న బిజెపి నేతలు ఇతర పార్టీల నుంచి వలసలను ప్రోత్సహిస్తున్నారు. స్వయంగా వారు సమావేశమవుతూ వారిని పార్టీలోకి లాగే ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది.

బలమైన నాయకులను తమ వైపు తిప్పుకునేందుకు తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పలువురు నేతలను కలిసినట్లు ప్రచారం సాగుతోంది. ఇప్పటికే కాంగ్రెసు కీలక నేత, మాజీ మేయర్ బండ కార్తిక రెడ్డి కాషాయ కండువా కప్పుకున్నారు. మరింత మందిని ఆ దారిలోకి తేవడానికి ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read: కాంగ్రెసుకు షాక్, బిజెపిలో చేరిక: ఉద్వేగానికి గురైన బండ కార్తిక రెడ్డి

ప్రధానంగా కాంగ్రెసు నాయకులకు బిజెపి వల విసురుతున్నట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. బిజెపి నేతలు పలువురు నాయకుల ఇళ్లకు వెళ్లినట్లు చెబుతున్నారు. మాజీ పార్లమెంటు సభ్యుడు కొండా విశ్వేశ్వర రెడ్డి నివాసానికి బండి సంజయ్ వెళ్లి చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అదేవంధా కూన శ్రీశైలంతో కూడా ఆయన చర్చలు చేసినట్లు చెబుతున్నారు. 

అంతేకాకుండా, శాసన మండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ ను కూడా బిజెపి నాయకులు సంప్రదించినట్లు తెలుస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు పట్ల స్వామి గౌడ్ అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. ఆయన కొంత కాలంగా టీఆర్ఎస్ కు దూరంగా ఉంటున్నారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా ఆయన నర్మగర్భంగా వ్యాఖ్యలు చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. 

Also Read: వరద సాయం నిలిపివేత: కేసీఆర్ విమర్శలను తిప్పికొట్టిన బండి సంజయ్

అదే విధంగా దేవీ ప్రసాద్ నివాసానికి కూడా బిజెపి నేతలు వెళ్లి చర్చలు జరిపినట్లు ప్రచారం సాగుతోంది. కాగా, ఆర్టీసీ సమ్మెను నడిపిన కార్మిక నేత అశ్వత్థామ రెడ్డి ఇప్పటికే బిజెపి నాయకులను కలిసినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ పట్ల అసంతృప్తితో ఉన్న నేతలను కూడా లక్ష్యంగా చేసుకుని బిజెపి నేతలు వల విసురుతున్నట్లు తెలుస్తోంది.