హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ (జిహెచ్ఎంసీ) ఎన్నికల వేళ కాంగ్రెసు పార్టీకి షాక్ తగిలింది. హైదరాబాదులో ఆ పార్టీ కీలక నేత, మాజీ మేయర్ బండ కార్తిక రెడ్డి బుధవారం బిజెపిలో చేరారు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, జాతీయ ప్రధాన ప్రధాన కార్యదర్శి భూపేందర్ యాదవ్ సమక్షంలో ఆమె బిజెపిలో చేరారు 

ఈ సందర్భంగా బండ కార్తిక రెడ్డి మాట్లాడుతూ తీవ్రమైన ఉద్వేగానికి లోనయ్యారు. కాంగ్రెసు పార్టీలో తనకు అన్యాయం జరిగిందని ఆమె అన్నారు. బిజెపిలో అటువంటి పరిస్థితి ఎదురు కాదని భావిస్తు్నట్లు తెలిపారు తన పనితనం చూసిన తర్వాతనే జీతం ఇవ్వాలని అంటూ ఆమె తీవ్రమైన ఉద్వేగానికి గురయ్యారు. 

జిహెచ్ఎంసి ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని ఆమె స్పష్టం చేశారు. కాంగ్రెసు పార్టీకి తాను సర్వం ధారపోశానని, కానీ తనకు ఇవ్వాల్సిన టికెట్న ఆ పార్టీ రెండు సార్లు వేరేవాళ్లకు కేటాయించిందని చెప్పారు ఈసారి మేయర్ సీటు బిజెపిదేనని, ఓటమి భయంతోనే మంత్రి కేటీఆర్ జిమ్మిక్కులు చేస్తున్నారని ఆమె అన్నారు. అంతిమంగా బిజెపి విజయం సాధిస్తుందని అన్నారు. 

తెలంగాణలో అవినీతి ప్రభుత్వాన్ని తరిమికొట్టడమే తమ లక్ష్యమని భూపేందర్ యాదవ్ అన్నారు డబుల్ బెడ్రూం ఇళ్లు ఎక్కడని పేదలు అడుగుతున్నారని ఆయన అన్నారు. వారికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం చెప్పాలని ఆయన అన్నారు. అసలు మీరేం చేశారని ఆయన కేసీఆర్ ను ప్రశ్నించారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మేయర్ పీఠం తమ పార్టీకి దక్కుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.