హైదరాబాద్:  తనపై హైదరాబాదులోని ఎస్సార్ నగర్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు కావడంపై బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. తనను ఎప్పుడు అరెస్టు చేస్తారని ఆయన అడిగారు. ఈ రోజు అరెస్టు చేస్తారా, రేపు అరెస్టు చేస్తారా అని అడిగారు. తనను ఎప్పుడు అరెస్టు చేస్తారో చేసుకోండని ఆయన అన్నారు.

కేసులకు, అరెస్టులకు భయపడేది లేదని బండి సంజయ్ అన్నారు. సమాధులు కూలుస్తామని ఎంఐఎం నేతలు అంటే కేసీఆర్ ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు కేసీఆర్ ఎంఐఎంకు మద్దతు ఇస్తున్నారు కాబట్టి తాను బదులివ్వాల్సి వచ్చిందని ఆయన ్ననారు. ప్రధాని పర్యటనలో సీఎం లేకపోవడంపై కూడా ఆయన స్పందించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉందని సీఎంకు తెలియదా అని ఆయన అడిగారు.   

తాను చేసిన వ్యాఖ్యలను బండి సంజయ్ సమర్థించుకున్నారు. పీవీ, ఎన్టీఆర్ సమాధులను కూల్చేస్తానంటారా, వారి అయ్య జాగీరా అని ఆయన అన్నారు. తాను మొదట అనలేదని, వారే మొదట అన్నారని, సీఎం స్పందించలేదు కాబట్టి తాను స్పందించానని ఆయన అన్నారు.

జిహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీలపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. హైదరాబాదులోని ఎస్సార్ నగర్ పోలీసులు వారిద్దరిపై సూమోటోగా కేసులు నమోదు చేశారు. 

జిహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారనే ఆరోపణపై వారిద్దరిపై కేసులు నమోదయ్యాయి. న్యాయ నిపుణుల సలహా తీసుకున్న తర్వాత బండి సంజయ్, అక్బరుద్దీన్ ఓవైసీలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

దారుసలాంను కూల్చివేస్తామని బండి సంజయ్ అక్బరుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలకు ప్రతిగా హెచ్చరించిన విషయం తెలిసిందే. ఎర్రగడ్డ డివిజన్ ప్రచారంలో ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

పీవీ నరసింహారావు, ఎన్టీఆర్ సమాధుల కూల్చివేత వ్యాఖ్యలపై అక్బరుద్దీన్ ఓవైసీ మీద పోలీసులు కేసు నమోదు చేశారు. అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన ఈ వ్యాఖ్యలకు ప్రతిస్పందిస్తూ బండి సంజయ్ దారుసలాంను క్షణాల్లో కూల్చివేస్తామని వ్యాఖ్యానించారు. 

జిహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న కొద్దీ పార్టీల మధ్య విమర్శలు, ప్రతివిమర్శల హోరు పెరుగుతోంది. డిసెంబర్ 1వ తేదీన జిహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు డిసెంబర్ 4వ తేదీన జరుగుతుంది.