హైదరాబాద్: జిహెచ్ఎంసీ ఎన్నికల వేళ ఎంఐఎం అధినేత, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ పెరిగిన కరెంట్ చార్జీల పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రభుత్వం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా తన డిమాడ్ల చిట్టాను విప్పారు. 

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ కాలంలో ఏప్రిల్, జూన్ నెల మధ్య కరెంట్ బిల్లులు విపరీతంగా పెరిగాయని, గృహ వినియోగదారులు వాటిని చెల్లించలేక ఇబ్బంది పడుతున్నారని ఆయన అన్నారు. ప్రతి బిల్లు నుంచి 300 యూనిట్ల మేరకు మినహాయింపు ఇవ్వాలని ఆయన కోరారు. 

హైదరాబాద్ వరదబాధితులకు రూ.10 వేల చొప్పున ఇస్తున్న సాయాన్ని డిసెంబర్ 1వ తేదీన పంపిణీ చేయడం ప్రారంభించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వరద సాయం పంపిణీలో అవకతవకలు జరగకుండా చూడాలని ఆయన సూచించారు 

వరదలు ముంచెత్తినప్పుడు టాక్సీలు, ఆటోలు ధ్వంసమయ్యాయని గుర్తు చేస్తూ ఆటో, టాక్సీ డ్రైవర్లకు నష్టపరిహారం చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.