జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన నిర్ణయం తీసుకొంది. జనసేన ఏర్పాటైన తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆ పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేయనుంది.

 

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేనతో పొత్తు లేదని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మంగళవారం నాడు ప్రకటించారు.ఈ ప్రకటన చేసిన కొద్దిసేపటికే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తామని జనసేన ప్రకటించింది. 

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయాలని కార్యకర్తలు బలంగా కోరుకొంటున్నారని పవన్ చెప్పారు. వారి అభిప్రాయాలకు అనుగుణంగా అభ్యర్ధులను నిలుపుతామని ఆయన పవన్ కళ్యాణ్ తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టుగా పవన్ కళ్యాణ్ మంగళవారం నాడు ఓ ప్రకటన విడుదల చేశారు.

 

ఇటీవల కాలంలో గ్రేటర్ హైద్రాబాద్ లో కమిటీలను కూడ జనసేన ప్రకటించిన విషయం తెలిసిందే. గ్రేటర్ ఎన్నికలను పురస్కరించుకొని ఈ కమిటీలను ఏర్పాటు చేసినట్టుగా ఊహగానాలు వెలువడ్డాయి.

జీహెచ్ఎంసీ పరిధిలో సెటిలర్ల ఓట్లు ఎక్కువగా ఉంటాయి. ఈ ఓట్లను తమ వైపునకు తిప్పుకొనేందుకు అన్ని పార్టీలు ప్రయత్నిస్తుంటాయి. ఏపీ రాష్ట్రంలో బీజేపీ, జనసేనలు కలిసి పోటీ చేస్తున్నాయి. కానీ  జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ ప్రకటించిన విషయం తెలిసిందే.

జనసేన ఈ ఎన్నికల్లో పోటీ చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది. జనసేన  పార్టీ ఏ పార్టీ ఓట్లను చీల్చుతోందోననే ఆసక్తి సర్వత్రా నెలకొంది.