హైదరాబాద్: జనసేన పార్టీపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని ఆ పార్టీ తెలంగాణ ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ డిమాండ్ చేశారు. ఢిల్లీ అగ్రనేతలు, తెలంగాణ రాష్ట్ర అగ్రనాయకులు కోరిన మీదటే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ నుంచి  జనసేన పార్టీ తప్పుకొని భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చిందని ఆయన తెలిపారు. ఇవేవీ తెలుసుకోకుండా అరవింద్ మాట్లాడం సబబు కాదన్నారు. 

శనివారం ఉదయం హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ జనసేన పార్టీ నాయకులు మాట్లాడారు. ఈ సందర్భంగా శంకర్ గౌడ్ మాట్లాడుతూ “ఎంపి అరవింద్ మాటలు చాలా బాధ కలిగించాయి. కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి శ్రీ కిషన్ రెడ్డి, బీజేపీ ఓబీసీ జాతీయ మోర్చా అధ్యక్షులు డా.లక్ష్మణ్, ఇతర అగ్ర నాయకులు  మద్దతు ఇవ్వాలని కోరితే విశాల ప్రజా ప్రయోజనాల దృష్ట్యా, ఒక్క ఓటు కూడా చీలకూడదనే సదుద్దేశంతో అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పోటీ నుంచి విరమించుకున్నారు. పవన్ కళ్యాణ్ నిర్ణయంతో అప్పటికే నామినేషన్ వేసిన అభ్యర్థులు కొంత మేర నిరుత్సాహానికి లోనైనా.. అధ్యక్షుడు మాట శిరోధార్యంగా భావించి పోటీ నుంచి తప్పుకొన్నారు'' అన్నారు.

''జనసేన పార్టీ ఏ పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చిందో మీకు తెలియకపోతే మీ అగ్రనాయకులను అడిగి తెలుసుకోండి.  అరవింద్ జనసైనికులను రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడటం సరైన పద్ధతి కాదు. మీ మాటలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం'' అని పేర్కొన్నారు.  

జనసేన పార్టీ ఉపాధ్యక్షులు బి.మహేందర్ రెడ్డి మాట్లాడుతూ “జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన పార్టీ 60 డివిజన్లలో పోటీ చేయాలని నిర్ణయించుకుంది. కొంత మంది అభ్యర్ధులు నామినేషన్ లు కూడా వేశారు. అయితే జనసేన పార్టీ పోటీ చేస్తే ఓట్లు చీలే అవకాశం ఉందని, భారతీయ జనతా పార్టీకి సంపూర్ణ మద్దతు ఇస్తే బాగుంటుందని తెలంగాణ బీజేపీ అగ్ర నాయకులు కోరడంతో  పవన్ కళ్యాణ్ పోటీ నుంచి తప్పుకొని సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఇవేవి ఎంపి అరవింద్ కి తెలియవేమో... తెలియకపోతే ఆ సమావేశాల వీడియోలు చూసి ఆ తర్వాత మాట్లాడితే బాగుంటుంది. మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు గత ఐదారు రోజులుగా జనసైనికులు బీజేపీ అభ్యర్ధుల గెలుపు కోసం శక్తివంచన లేకుండా ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికి ప్రచారంతోపాటు బైక్ ర్యాలీలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో అరవింద్ గారు ఇలాంటి మాటలు మాట్లాడి క్యాడర్ మనోభావాలను దెబ్బ తీయొద్దు. జనసేన పార్టీపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాము'' అన్నారు. 

జనసేన పార్టీ హైదరాబాద్ నగర అధ్యక్షులు రాధారం రాజలింగం మాట్లాడుతూ “పవన్ కళ్యాణ్ బీజేపీ నాయకుల దగ్గరకు రాలేదు... బీజేపీ నాయకులే పవన్ కళ్యాణ్  దగ్గరకు వచ్చి మద్దతు అడిగిన విషయం అరవింద్ తెలుసుకోవాలి. జనసైనికులు, వీర మహిళలు బీజేపీ నాయకుల గెలపుకోసం ప్రతి డివిజన్ లో ప్రచారం చేస్తున్నారు.  ఇలాంటి సమయంలో జనసైనికులను బాధపెట్టేలా మాట్లాడొద్దు. దయచేసి మీ మాటలు వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాం” అని అన్నారు.