జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు అధికార టీఆర్ఎస్ పార్టీకి భారీగా షాకిచ్చాయి. సీనియర్ మంత్రుల ఇలాకాలో కూడా అట్టర్ ప్లాఫ్ రిజల్ట్స్ వచ్చి పార్టీకి కోలుకోలేని దెబ్బగా మారాయి. 

టీఆర్ఎస్ పార్టీలో కీలక నేతగా, హోం మంత్రిగా ఉన్న మహమూద్‌ అలీ ఇలాకాలో టీఆర్ఎస్ పార్టీ ఘోరంగా విఫలమయ్యింది. ఆ నియోజకవర్గంలో టీఆర్ఎస్ కనీసం ఒక్క సీటును కూడా తన ఖాతాలో వేసుకోలేకపోయింది.

మహమూద్ అలీ నియోజకవర్గమైన మలక్‌పేటలో 7 డివిజన్లు ఉన్నాయి. వీటిలో 5 ఎంఐఎం గెలుచుకుంది. మరో 2 బీజేపీ దక్కించుకుంది. గతంలో ముసారాంబాగ్, సైదాబాద్‌ డివిజన్లను టీఆర్‌ఎస్‌ గెలుచుకోగా ఇప్పుడు ఆ రెండు డివిజన్లలో బీజేపీ జెండా పాతింది. దీంతో ఇది పార్టీకి కోలుకోలేని దెబ్బ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

హోంమంత్రి మహమూద్ అలీ.. నియోజకవర్గ ఇంచార్జి, డివిజన్‌ అధ్యక్షులు పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేసినప్పటికీ.. ఎంఐఎం ఫ్రెండ్లీ కంటెస్ట్‌తో ఇతర పార్టీల నాయకులతో ప్రచారం చేయవద్దని ఒత్తిడి వచ్చింది. దీంతో హోంమంత్రి తూతూ మంత్రంగా ప్రచారం చేశారు. 

ఫ్రెండ్లీ కంటెస్ట్‌ లేకపోతే కనీసం మూసారాంబాగ్, సైదాబాద్, అక్బర్‌బాగ్, ఓల్డ్‌ మలక్‌పేట డివిజన్లను గెలిచేవారమని టీఆర్‌ఎస్‌ నాయకులు అంటున్నారు. ఏది ఏమైనా మలక్‌పేట నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ను గ్రేటర్‌ ఫలితాలు కోలుకోలేని దెబ్బ తీశాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.