హైదరాబాద్: జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బిజెపి విజయావకాశాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెసు దెబ్బ తీసిందనే అంచనాలు కొనసాగుతున్నాయి. ఆంధ్ర సెటిలర్లు ఎక్కువగా ఉన్న డివిజన్లలో బిజెపి విజయావకాశాలు భారీగా దెబ్బ తినడమే ఆ అంచనాకు కారణంగా చెప్పవచ్చు. ఆంధ్ర సెటిలర్లు గతంలో చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ వైపు ఉంటూ వచ్చారు. అయితే, ఈసారి మాత్రం టీఆర్ఎస్ వైపు ఉన్నట్లు అర్థమవుతోంది. 

సెటిలర్లు ప్రభావితం చేసే శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి, జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ 27 డివిజన్లలో విజయం సాధించింది. 2018, తెలంగాణ శాసనసభ, 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్, వైసీపీ పరస్పరం సహకరించుకున్నాయి. దానివల్ల కాంగ్రెసుకు, టీడీపీకి తెలంగాణలో కూడా భారీ దెబ్బ తగిలింది. 

ఆంధ్ర సెటిలర్లు ఎక్కువగా ఉన్న శాసనసభ నియోజకవర్గాల్లో బిజెపికి దెబ్బ పడింది. బిజెపి ఆంద్రప్రదేశ్ నేత విష్ణువర్దన్ రెడ్డి హైదరాబాదుకు వచ్చి తమ పార్టీకి అనుకూలంగా సెటిలర్లను కూడగట్టే ప్రయత్నం చేశారు. బిజెపి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా తన వంతు పాత్ర నిర్వహించారు. అయినప్పటికీ బిజెపి తగిన ఫలితాలు సాధించలేకపోయింది. వైసీపీ టీఆర్ఎస్ కు సహకరించడం వల్లనే అది జరిగిందని భావిస్తున్నారు. 

వైఎస్ జగన్ నేరుగా వైసీపీ శ్రేణులకు ఆ సంకేతాలు ఇచ్చారా, లేదా అనేది పక్కన పెడితే, ఆంధ్ర సెటిలర్లు మాత్రం టీఆర్ఎస్ వైపు ఉన్నారని ఫలితాలను బట్టి అర్థమవుతోంది. బహుశా, శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న తమ ఎమ్మెల్యేల ప్రాబల్యం తగ్గకూడదనే ఉద్దేశంతో కూడా ఆంద్ర సెటిలర్లు టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపి ఉండవచ్చు.  కానీ, వైసీపీ శ్రేణులు మాత్రం కచ్చితంగా టీఆర్ఎస్ వైపు ఉన్నట్లు అర్థమవుతోందని అంటున్నారు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో వైసీపీ పోటీ చేయకుండా టీఆర్ఎస్ కు పరోక్షంగా మద్దతు ఇచ్చిందని అంటున్నారు.