Asianet News TeluguAsianet News Telugu

జిహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల దెబ్బ: కేటీఆర్ కోటరీ ఇదే...

టీఆర్ఎస్ లో కేటీఆర్ వర్గం ఒక్కటి తయారైంది. ఈ కోటరీ వల్ల గతంలో మాదిరిగా టీఆర్ఎస్ సామూహిక శక్తి లక్షణాన్ని కోల్పోయిందని చెప్పవచ్చు. జిహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలకు అదే కారణమని అంటున్నారు.

GHMC Election results 2020: KTR couterie in TRS failed
Author
Hyderabad, First Published Dec 5, 2020, 8:38 AM IST

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్థానంలోకి వెళ్లాలని ప్రయత్నించిన ఆయన తనయుడు కేటీ రామారావుకు జిహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు పెద్ద దెబ్బనే. అతి పెద్ద పార్టీగా టీఆర్ఎస్ అవతరించినప్పటికీ టీఆర్ఎస్ ఓటమి పాలైనట్లుగానే సంకేతాలు వెళ్తున్నాయి. దీనికి పూర్తి బాధ్యత కేటీఆర్ వహించాల్సిందే. ఈ ఎన్నికల్లో కనీసం మ్యాజిక్ ఫిగర్ నైనా దాటి ఉంటే కేటీఆర్ స్థానం పదిలంగానే ఉండేది. 

కానీ, దిగదిడుపు ఫలితాలు సాధించడం వల్ల కేటీఆర్ ఏమీ చెప్పుకోలేని స్థితిలో పడిపోయారు. టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వంలోనూ, పార్టీలోనూ కేటీఆర్ అంతా తానై వ్యవహరించారు. ఒక రకంగా ముఖ్యమంత్రి స్థాయి గౌరవాన్ని ఆయన పొందారు వరంగల్ పర్యటనలో కేటీఆర్ కు ముఖ్యమంత్రి స్థాయి స్వాగత ఏర్పాట్లు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవచ్చు. 

కేటీఆర్ పార్టీలోనూ ప్రభుత్వంలోనూ తనదంటూ ఓ కోటరీని ఏర్పాటు చేసుకున్నారు. దీంతో పార్టీలో సీనియర్లు ద్వితీయ స్థానంలోకి వెళ్లిపోయారు. కేటీఆర్ హై ప్రొఫైల్ లీడర్ గానే కాకుండా మాస్ లీడర్ గా కూడా అవతరించడానికి తీవ్రమైన ప్రయత్నాలే చేశారు. ప్రజల్లోకి వచ్చినప్పుడు ప్రజల భాషను, పారిశ్రామికవర్గాలతో, విదేశీ ప్రతినిధులతో, ఉన్నత వర్గాలతో సమావేశమైనప్పుడు ఆ భాషను వాడుతూ వచ్చారు. 

అయితే, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆ వ్యూహాలు ఏవీ పనిచేయలేదు. ఆయన కోటరీ వైఫల్యం ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనిపిస్తోంది. కేటీఆర్ ను మెప్పించడానికి వారు చేసిన ప్రయత్నాలు ఎన్నికల్లో విజయం సాధించడానికి చేయలేదని చెప్పవచ్చు.  కింది స్థాయిలో ఏం జరుగుతుందో తెలియని స్థితిలోకి కేటీఆర్ వెళ్లిపోయారని భావించవచ్చు. వివిధ వర్గాల ఉమ్మడి అభిప్రాయానికి బదులు, ఉమ్మడి ప్రయోజనాలను తీర్చే బదులు కేటీఆర్ వ్యక్తులను ఎంచుకుని పనిచేస్తూ వచ్చారు. మౌనంగా ఉన్న వివిధ వర్గాలు తమకు వ్యతిరేకంగా ఉన్నాయనే విషయాన్ని కేటీఆర్ పసిగట్టలేకపోయారు. ప్రభుత్వంలో ఏమీ జరగదనే అసంతృప్తికి గురైనవారి సంఖ్య ఈ ఆరేళ్ల కాలంలో గణనీయంగా పెరిగిందనే విషయం ఆయనకు చేరకుండా పోయింది.

మంత్రి శ్రీనివాస గౌడ్, ఎమ్మెల్యే బాల్క సుమన్, అటూ ఇటుగా మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఆయనకు అత్యంత సన్నిహితులుగా ఉంటూ వస్తున్నారు. ప్రభుత్వపరంగా చూస్తే, ఐటీ విభాగం డైరెక్టర్ కొణతం దిలీప్ ఆయనకు అత్యంత సన్నిహితుడు. చెప్పాలంటే, టీఆర్ఎస్ లో కేటీఆర్ వర్గం ఒక్కటి ఏర్పడింది. గతంలో కేసీఆర్ వర్గం మాత్రమే ఉండేది. దాంతో టీఆర్ఎస్ సామూహిక శక్తి లక్షణాన్ని కోల్పోయిందని చెప్పవచ్చు.

కేటీఆర్ ప్రభుత్వంలోనూ, పార్టీలోనూ ముందుకు రావడం వల్ల ఆ వర్గానిది పైచేయి అవుతూ వచ్చింది. ఆ స్థితిలో చాలా మంది సీనియర్ అధికారులు, పార్టీలోని సీనియర్లు మొక్కుబడిగానే కొనసాగుతున్నారని చెప్పవచ్చు. ప్రత్యామ్నాయం కనిపించకపోవడం కూడా చాలా మంది నాయకులను టీఆర్ఎస్ లో ఉండేలా చేసింది. బిజెపి ప్రత్యామ్నాయ శక్తిగా జిహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలతో ముందుకు వచ్చినట్లే. ఇప్పుడు టీఆర్ఎస్ లోని అసంతృప్తివాదులకు బిజెపి ప్రత్యామ్నాయంగా కనిపించే అవకాశాలున్నాయి. ఇది కేటీఆర్ కు భవిష్యత్తులో పెను సవాల్ విసిరే అవకాశం ఉంది.  

Follow Us:
Download App:
  • android
  • ios