హైదరాబాద్: తెలంగాణలో జిహెచ్ఎంసీ ఎన్నికలు కొత్త పరిణామాలకు పునాదులు వేస్తున్నాయి. టీఆర్ఎస్ ను ఎదుర్కునే శక్తి ఏ పార్టీకి లేదనే అంచనాలను జిహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు తలకిందులు చేశాయి. బిజెపిని టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా నిలబెట్టాయి. తెలంగాణ భవిష్యత్తు రాజకీయాలకు ఈ ఎన్నికలు సంకేతాన్ని ఇస్తున్నాయి. 

ప్రతిపక్షాల ఓట్లు చీలే వ్యూహంతో తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇంత వరకు తిరుగులేని శక్తిగా కొనసాగుతూ వచ్చారు. దుబ్బాక మినహా ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లోనూ ప్రతిపక్షాలు ఓట్లు చీలిపోవడం ద్వారా టీఆర్ఎస్ ప్రయోజనం పొందుతూ వచ్చింది. కాంగ్రెసు స్వయంకృతాపరాధం వల్ల నానాటికీ దిగజారుతూ రావడం కూడా టీఆర్ఎస్ కు కలిసి రావడం చూడవచ్చు..

జిహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ప్రతిపక్షాలన్నీ విడిగానే పోటీ చేశాయి. అయితే, ఇది టీఆర్ఎస్ కు కలిసి రాలేదు. ప్రజలు ప్రత్యామ్నాయాన్ని వెతుక్కునే క్రమంలో బిజెపి వారికి ఆలంబనగా కనిపించింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతున్న దోరణికి హైదరాబాదు ప్రజలు గండి కొట్టారు. టీఆర్ఎస్ ను ఓడించాలనే సంకల్పంతో ప్రతిపక్షాల ఓట్లన్నీ బిజెపికి పడినట్లు అర్థమవుతోంది. 

ఈ ఎన్నికల్లో టీడీపీ గల్లంతు కావడం, వామపక్షాల ఊసే లేకపోవడం, కాగ్రెసు రెండు స్థానాలకే పరిమితం కావడం, ఇండిపెండెంట్ల వెన్ను విరగడం, అనూహ్యంగా బిజెపి 48 స్థానాలను గెలుచుకోవడం ఆ విషయాన్ని తెలియజేస్తున్నాయి. జిహెచ్ఎంసీ ఎన్నికలు టీడీపీ అధినేత చంద్రబాబుకు షాక్ ఇచ్చాయి.

తెలుగుదేశం పార్టీ 106 డివిజన్లలో పోటీ చేస్తే ఆ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కలేదు. ఒకప్పుడు టీడీపీ కూటమి కట్టినప్పుడు ఆ కూటమిలో బిజెపి చిన్న భాగస్వామిగా ఉంది. ఇప్పుడు అదే ప్రధాన శక్తి అయింది. టీడీపీకి కేవలం 1.29 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. 500 మందికిపై ఇండిపెండెంట్ల డిపాజిట్లు గల్లంతయ్యాయి. ఎంఐఎంకు 15 శాతం చిల్లర ఓట్లు పోలయ్యాయి.

బిజెపికి టీఆర్ఎస్ కన్నా ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. టీఆర్ఎస్కు 30.79 శాతం ఓట్లు రాగా, బిజెపికి 31.43 శాతం ఓట్లు వచ్చాయి. టీఆర్ఎస్ 13.06 శాతం ఓట్లను కోల్పోయింది. దీన్నిబట్టి చూస్తే టీఆర్ఎస్ ను ఎదుర్కోవడానికి బిజెపి సమఉజ్జీగా మారుతున్న విషయాన్ని గమనించవచ్చు.