హైదరాబాద్: మరో రెండురోజుల్లో రుతుపవనాల రాక సమాచారంతో  గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అప్రమత్తమయ్యింది.  భారీ వ‌ర్షాల‌తో ఏర్ప‌డే ప‌రిస్థితుల‌ను ఎదుర్కొనేందుకు ప్ర‌ణాళిక‌ను సిద్దం చేస్తున్నారు జిహెచ్‌ఎంసి అధికారులు. రూ. 24 కోట్ల 53 ల‌క్ష‌ల‌తో  ప్ర‌త్యేక ప్ర‌ణాళిక రూపొందించిన‌ట్లు జిహెచ్‌ఎంసి మెయింట‌నెన్స్ విభాగం అధికారులు వెల్లడించారు. 

భారీ వర్షాలతో నీరు నిలిచే 157 ప్ర‌దేశాల్లో చర్యలు చేపట్టినట్లు కార్పొరేషన్ అధికారులు తెలిపారు. జఠిలంగా ఉండే పలు చోట్ల పంపింగ్‌కు 10 హెచ్‌పి మోట‌ర్లు ఏర్పాటు చేశామన్నారు. అలాగే నగరవ్యాప్తంగా 87 మినీ మొబైల్ మాన్సూన్ టీమ్స్‌, 79 మొబైల్ మాన్సూన్ టీమ్స్‌ సిద్ధం చేశామన్నారు. జిహెచ్‌ఎంసి జోన‌ల్ ఎమ‌ర్జెన్సీ టీమ్‌, 101 స్టాటిక్ లేబ‌ర్ టీమ్స్‌ రెడీగా వున్నట్లు జిహెచ్‌ఎంసి చీఫ్ ఇంజ‌నీర్ జియాఉద్దీన్‌ తెలిపారు.

read more   ప్రాణాలను బలితీసుకున్న అకాల వర్షాలు... పిడుగుపాటుతో నలుగురు మృతి

ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్లు వర్షాలు కురుస్తున్నాయి. భానుడి భగభగలు తగ్గి శుక్రవారం సాయంత్రం నుండి వర్షాలు మొదలయ్యాయి. వరంగల్ జిల్లాలో కురిసిన అకాల వర్షాలకు కొందరు రైతులకు పంటనష్టం వాటిల్లింది. చేతికొచ్చిన పంట నీటిపాలయ్యింది. ఇక తీవ్రమైన ఎండలతో విలవిల్లాడిపోయిన  ప్రజలకు ఈ వర్షాలు ఉపశమనం కలిగించాయి.