మహబూబ్ నగర్ పట్టణం ఇవాళ తెల్లవారుజామున ప్రమాదం చోటుచేసుకుంది. ఓ దుకాణంలో గ్యాస్ సిలిండర్ పేలుడు దాటికి ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. అంతేకాకుండా ఈ పేలుడు దాటికి రోడ్డుపై నిలిపివున్న వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. 

ఈ ఘటన పట్టణంలోని పద్మావతి కాలనీలో చోటుచేసుకుంది. ఈ కాలనీలో జొన్నరొట్టెలు అమ్మే ఓ దుకాణంలో ఈ పేలుడు జరిగింది. ఇవాళ తెల్లవారుజామున ఆ దుకాణం ముందు ఓ ఐదుగురు వ్యక్తులు చలిమంట వేసుకున్నారు. అయితే దుకాణంలో అప్పటికే ఆ షాప్ లో గ్యాస్ లీకవుతోంది. ఇదే సమయంలో వీరు చలిమంట వేయడంతో ప్రమాదం చోటుచేసుకుంది. 

గ్యాస్ పేలుడు దాటికి ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడగా వారిసి స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా వున్నట్లు సమాచారం. ఈ దుకాణం ముందు నిలిపి వున్న చాలా కార్లు ఈ పేలుడు దాటికి ద్వంసమయ్యాయి. 

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.