Asianet News TeluguAsianet News Telugu

బీఆర్‌ఎస్‌లో అంతర్గత విభేదాలు.. అమలుకాని అధినేత ఆదేశాలు.. కేసీఆర్‌కు కొత్త తలనొప్పి..!

భారత రాష్ట్ర సమితితో(బీఆర్ఎస్) జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌‌కు స్వరాష్ట్రంలోనే కొత్త తలనొప్పి మొదలైంది. 

gap between ministers and brs mlas in several districts may create new headache for KCR
Author
First Published Dec 20, 2022, 9:47 AM IST

భారత రాష్ట్ర సమితితో(బీఆర్ఎస్) జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌‌కు స్వరాష్ట్రంలోనే సరికొత్త తలనొప్పి మొదలైంది. రాష్ట్రంలో ఎన్నికలకు ఏడాది కంటే తక్కువ సమయం ఉండటంతో.. పార్టీ బలోపేతానికి, రాష్ట్రంలో మరోసారి అధికారం చేజిక్కుంచుకోవడానికి కేసీఆర్ ఇప్పటికే పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అయితే నేతల మధ్య అంతర్గత విభేదాలు పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారాయి. పలుచోట్ల మంత్రులకు, ఎమ్మెల్యేలకు మధ్య గ్యాప్ ఉంది. నామినేటెడ్ పదవులు, నిధుల కేటాయింపు, ప్రోటోకాల్.. ఇలా పలు అంశాలకు సంబంధించి విభేదాలు కొనసాగుతున్నాయి. 

తాజాగా మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగా మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలోని ఎమ్మెల్యేలు అసమ్మతి గళం వినిపించిన సంగతి  తెలిసిందే. ఇక్కడ విభేదాలు రచ్చకెక్కగా.. మరికొన్ని చోట్ల కూడా ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. పలుచోట్ల మంత్రులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. కొన్నిచోట్ల ఈ అసంతృప్తి బహిరంగంగానే వ్యక్తం అవుతుంది. 

మహబూబాబాద్ జిల్లాలో మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ మధ్య విభేదాలు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో మంత్రి సబితా ఇంద్రారెడ్డికి కొందరు ఎమ్మెల్యేలకు మధ్య గ్యాప్ ఉంది. సబితా ఇంద్రారెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న మహేశ్వరం నియోజకవర్గానికే చెందిన మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి బహిరంగంగానే ఆమెపై పలు సందర్భాల్లో విమర్శలు చేశారు.  ఉమ్మడి నల్గొండ జిల్లాలో మంత్రి జగదీష్ రెడ్డి‌కి కొందరు ఎమ్మెల్యేలకు మధ్య గ్యాప్ ఉందనే ప్రచారం ఉంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతుంది.

దీంతో వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కేసీఆర్ సూచించిన ప్రణాళికలు.. చాలా చోట్ల అమలు కావడం లేదు. మునుగోడులో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనాలు పార్టీ అభ్యర్థి గెలుపుకు సహకరించాయని భావిస్తున్న కేసీఆర్.. అదే విధమైన ప్రణాళికలను అమలు చేయాలని నిర్ణయానికి వచ్చారు. ఈ క్రమంలోనే గత నెలలో తెలంగాణ భవన్‌లో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో.. వచ్చే 10 నెలలు ఎమ్మెల్యేలు నియోజకవర్గాలపైనే దృష్టి పెట్టాలని ఆదేశించారు. నియోజకవర్గాల్లో పార్టీ తరఫున ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలని.. ఎమ్మెల్యేలు, మంత్రులు సమన్వయంతో నిర్వహించాలని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఇందుకు సంబంధించి కేసీఆర్ విధించిన గడువు కూడా పూర్తైనప్పటికీ.. చాలా చోట్ల ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహణ జరగలేదు. ఇందుకు ఎమ్మెల్యేలకు, మంత్రులకు మధ్య సఖ్యత లేకపోవడమే కారణంగా కనిపిస్తోంది. కొన్నిచోట్ల మాత్రం ఈ సమావేశాలను నిర్వహించారు.

అలాగే క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడం, నిత్యం పార్టీ పరిస్థితిని తెలుసుకోవడం కోసం.. ప్ర‌తి వంద ఓట‌ర్ల‌కు ఒక ఇంచార్జ్‌ను నియ‌మించాలని నాయకులను కేసీఆర్ ఆదేశించారు. వారి ఫోన్ నెంబర్లను పార్టీ అధిష్టానానికి అందజేయాలని చెప్పారు. తాను కూడా రాష్ట్రం మొత్తం పర్యటించనున్నట్టు చెప్పారు. నియోజ‌క‌వ‌ర్గ అబివృద్దిపై రిపోర్ట్ కార్డ్ సిద్దం చేసుకోవాలని ఆదేశించారు. అయితే ఇప్పటివరకు చాలా చోట్ల నేతలు ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదు.

ఇందుకు కారణం.. కొందరు మంత్రలు వారి జిల్లాల్లోని ఇతర నియోజవర్గాలపై పెత్తనం చెలాయించడమేనన్న ప్రచారం సాగుతుంది. జిల్లా యంత్రాంగంపై మంత్రులు పట్టు సాధించడం కొందరు ఎమ్మెల్యేలకు ఇబ్బందికరంగా మారుతుంది. నిధుల కేటాయింపు, నామినేటెడ్ పదవులు విషయంలో మంత్రులు వ్యవహరిస్తున్న తీరును కూడా వారు వ్యతిరేకిస్తున్నారు. దీంతో మంత్రులు, ఎమ్మెల్యేలకు మధ్య గ్యాప్ పెరుగుతుంది.  అయితే పలుచోట్ల ఈ విభేదాలు దృష్టికి వచ్చిన వెంటనే అధిష్టానం.. పరిస్థితులను చక్కదిందేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే చాలా చోట్ల ఇలాంటి పరిస్థితులే నెలకొనడంతో.. కేసీఆర్‌కు తలనొప్పిగా మారింది.

Follow Us:
Download App:
  • android
  • ios