వివాదాల సుడిగుండంలో ఘంటా చక్రపాణి నిరుద్యోగుల్లో పెల్లుబుకుతున్న ఆగ్రహ జ్వాలలు రాజీనామాకు రాజకీయ పార్టీల ఒత్తిళ్లు సర్కారు తప్పిదాలను భుజాన మోయాల్సిన పరిస్థితి చక్రపాణిపై పోరుబాట పట్టిన తెలంగాణ జెఎసి
ఘంటా చక్రపాణి తెలంగాణ మేథావుల జాబితాలో టాప్ లిస్టులో ఉండే పేరు. ఆయన మాట గంట కొట్టినట్లే ఉంటది. ఆయన వాగ్దాటికి ప్రత్యర్థులు జీ హుజూర్ అనాల్సిందే. ఆయన ఉపన్యాసాలు, ఆయన రాతలు అన్నీ తెలంగాణ ఉద్యమంలో భాగమయ్యాయి. ఉద్యమకారులకు ఉప్పందించాయి. వారిని చైతన్యం చేశాయి. అంతకంటే గొప్పగా చెప్పాలంటే ఉద్యమకారులను కార్యోన్ముఖులను చేశాయి. తెలంగాణ రాష్ట్రం కోసం సాగిన మహోన్నత ఉద్యమ చరిత్రలో ఆయనకూ ఒక పేజీ ఉండాల్సిందే.
ఘంటా చక్రపాణి అంబేద్కర్ యూనివర్శిటీ ప్రొఫెసర్ గా వందల టివి చర్చల్లో పాల్గొని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను వివరించారు. ఆయన ఏ టివీ చర్చలో ఉంటే ఆ టివినే తెలంగాణ జనాలు చూసే రోజులవి. అంత బాగా చర్చలో పాల్గొని తెలంగాణ బావజాల వ్యాప్తికి కృషి చేశారు. తన వాగ్ధాటితో సీమాంధ్ర మేధావులను నీళ్లు నమిలేలా చేసిన ఘనత ఆయనది. గణాంకాలు, వివరాలు నోటిమాటగా చెప్పే నేర్పరి ఘంటా చక్రపాని. ప్రజా వైద్యుడు, టిఆర్ఎస్ నేతగా ఉన్న చెరుకు సుధాకర్ మీద పిడి యాక్టు కింద కేసు పెట్టి అరెస్టు చేసిన సందర్భంలో ‘వంట చెరుకును కాపాడుకుందాం’ అంటూ చక్రపాణి నమస్తే తెలంగాణ పత్రికలో రాసిన కథనానికి మంచి స్పందన వచ్చింది.
కరీంనగర్ లో పుట్టి పెరిగిన చక్రపాణి జర్నలిస్టుగా, లెక్చరర్ గా, ప్రొఫెసర్ గా పని చేశారు. సోషియాలజీలో, జర్నలిజంలో పిజి చదివారు. రిలీజియన్ అనే అంశంపై ఉస్మానియాలో పిహెచ్ డి పూర్తి చేశారు. ఉదయం, ఆంధ్రజ్యోతి పత్రికల్లో పనిచేశారు. ఆల్ ఇండియా రేడియోలో న్యూస్ రీడర్ గా కొద్దికాలం పనిచేశారు.2004-05 ప్రాంతంలో నక్సల్స్ తో వైఎస్ ప్రభుత్వం చర్చలు జరిపింది. ఆ చర్చల ప్రతినిధిగా ఘంటా వ్యవహరించారు.
తెలంగాణ రాకముందు కానీ వచ్చిన తర్వాత కానీ ఆయన ఏనాడూ టిఆర్ఎస్ పార్టీతో అంటకాగలేదు. టిఆర్ఎస్ పార్టీతో సంబంధం లేకుండానే తనదైన శైలిలో ఉద్యమంలో పనిచేశారు. కానీ ఆయన ఉద్యమానికి చేసిన సేవలకు గుర్తింపుగా తెలంగాణ సర్కారు తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ కు తొలి ఛైర్మన్ గా నియమించి గౌరవించింది. మరి తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన పాత్ర ఏంటి? ఆయన పయనం ఎటువైపు? అనేది ఇపుడు ప్రశ్న.
ఘంటా చక్రపాణి తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ ఛైర్మన్ అయిన తర్వాత తెలంగాణలో భారీ సంఖ్యలో ఉద్యోగాల జారత సాగుతుందేమోనని నిరుద్యోగ యువత ఆశించారు. కానీ వారి ఆశలు అడియాశలయ్యాయి. కారణాలేమైనా ప్రతి నోటిఫికేషన్ వివాదాల్లో చిక్కుకుంది. సిలబస్ నుంచి మొదలుకొని, నోటిఫికేషన్ జారీ, తర్వాత సవరణ, తర్వాత వాయిదాలు, తర్వాత కోర్టు కెక్కడం ఆ నోటిఫికేషన్ భవిష్యత్తు ప్రమాదంలో పడడం... నిరుద్యోగులు ఊసూరుమనం ప్రతి సందర్భంలోనూ జరుగుతూనే ఉన్నది. దీనికి ఎవరు బాధ్యులు? స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న రాజ్యాంగసంస్థ ఛెయిర్మన్ గా చక్రపాణియే. తెలంగాణలో వెలువరించిన ప్రతి ఉద్యోగ నోటిఫికేసన్ వివాదాల్లో చిక్కుకుని విలవిలలాడుతున్నది. ఈ వివాదాలు నిరుద్యోగులను కాల్చుకుతింటున్నాయి.
గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇచ్చిర్రు. కానీ ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నది. దీంతో కోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. 1: 3 చొప్పున ఇంటర్వ్యూలకు పిలవడం వివాదమైంది. తుదకు వివాదాలు పెరిగిపోవడంతో గ్రూప్ 2 నియామక ప్రక్రియ ఆపాలని హైకోర్టు స్టే ఇచ్చింది.
ఇక గురుకులాల చరిత్ర మరీ ఆగమాగం అయింది. అధ్వాన్నంగా మారింది. గురుకులాల సిలబస్ తయారీ నుంచి మొదలుకొని నోటిఫికేషన్ జారీ వరకు అనుక్షణం వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. తుదకు మళ్లీ హైకోర్టు ఆ ప్రక్రియను నిలిపివేసింది. గురుకులాల ప్రిలిమ్స్ పరీక్షలు ముగిసి మెయిన్స్ పెండింగ్ లో పడ్డాయి. కొందరి మెయిన్స్ అయిపోయినయి. కొందరు రాయకుండనే ఆగిపోయిర్రు.
ఇక పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నియామకాల కోసం పరీక్షలు జరిపారు. కానీ పలితాలు ఇవ్వలేదు. టిఎస్పిఎస్సీ పై నిరుద్యోగులు జోక్ చేసే స్థాయికి చేరిపోయింది.
నీళ్లు, నిధులు, నియామకాలు ప్రధాన ఎజెండాగా తెలంగాణ ఉద్యమం సాగింది. తెలంగాణలో ఉద్యోగాలన్నీ సీమాంధ్ర ప్రాంతం వారే కొల్లగొడుతున్నారన్న ప్రచారం బలంగా ఉండేది ఆరోజుల్లో. నిజం కూడా లేకపోలేదు. అందుకే మన ఉద్యోగాలు మనకే దక్కాలంటే తెలంగాణ రావాలని నిరుద్యోగ యువత లక్షలాదిగా తరలివచ్చి తెలంగాణ పోరాటంలో పాలుపంచుకున్నారు. దీంతో తెలంగాణ వచ్చిన తర్వాత లక్షల కొలువులు వస్తాయని ఉద్యమ పార్టీ నేతలు చెప్పిర్రు. విద్యార్థులు ఆశపడ్డరు. కానీ ఆచరణలో జరుగుతున్నది మాత్రం వేరే ఉంది. తెలంగాణ వచ్చి, టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతున్నా ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదంటే తెలంగాణ సర్కారుకు విద్యారంగం మీదున్న శ్రద్ధ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. కొద్దోగొప్ప ఇచ్చిన ఉద్యోగాలు కూడా కేవలం పోలీసు శాఖలోనే ఉన్నాయి. అవికూడా వివాదాల్లో చిక్కుకున్నాయి. ఇక తెలంగాణలో వేల సంఖ్యలో టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ, లక్షలాది మంది బిఇడి, డిఇడి చదివిన వారు ఉన్నప్పటికీ, సుప్రీంకోర్టు సీరియస్ అయినప్పటికీ తెలంగాణ సర్కారు మాత్రం ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయకుండా టైంపాస్ చేయడం నిరుద్యోగ యువతను ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో సహజంగా నిరుద్యోగ యువత సర్కారు తీరు పట్ల ఆగ్రహంగా ఉంది.
అయితే డిఎస్సీ జరపకుండా టీచర్ పోస్టుల భర్తీ టిఎస్పిఎస్సికి ఇవ్వడంతో, అది కూడా వివాదాల్లో చిక్కకుని కోర్టు బ్రేక్ వేయడంతో నిరుద్యోగ సైన్యం ఆగ్రహమంతా తెలంగాణ సర్కారుతోపాటు టిఎస్సిఎస్సీ కూడా షేర్ చేసుకోవాల్సి వస్తోంది. అందులో ఘంటా చక్రపాణి కూడా వాటా భరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిజానికి నోటిఫికేషన్ వెలువరించి ప్రక్రియ చేపట్టడం సర్వీసు కమిషన్ పని. కానీ సిలబస్, ఇతర వ్యవహారాలన్నీ సర్కారు శాఖలు చేయాల్సిన పని. అయితే సర్కారు ప్రతి నోటిఫికేషన్ విడుదల సందర్భంగా ఏదో ఒక లొసుగు ఉంచి జారీ చేయడం తీరా అది కోర్టుకు చేరి పెండింగ్ లో పడడం షరామామూలుగా సాగుతున్న వ్యవహారం. ఇందులో తన ప్రమేయం లేకపోయినా ఘంటా విద్యార్థుల ఆగ్రహాన్ని చవిచూడాల్సిన పరిస్థితి వస్తుందంటున్నారు.
రెండు మూడు సందర్భాల్లో పలువురు అభ్యర్థులు ఆయనను కలిసేందుకు వెళ్లిన సందర్భంలో దురుసుగా మాట్లాడినట్లు చెబుతున్నారు. కొందరు మహిళా అభ్యర్థులు కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని అభ్యర్థులు అంటున్నారు. ఇంకొన్ని సందర్భాల్లో కోచింగ్ సెంటర్ల ఏజెంట్లుగా నావద్దకు వస్తే సహించబోనంటూ విద్యార్థులు నొచ్చుకునేలా మాట్లాడినట్లు చెబుతున్నారు.
ఇప్పటివరకు సహనంతో చూసిన నిరుద్యోగ యువత ఇప్పుడు చక్రపాణిని టార్గెట్ చేస్తోంది. చక్రపాణి రాజీనామా చేయాలన్న డిమాండ్ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నది. సర్కారు మీద కంటే చక్రపాణి మీదే యువత ఫోకస్ పెడుతున్నది. మరోవైపు రాజకీయ పార్టీలు సైతం ఇటు సర్కారును అటు కమిషన్ ను సమాంతరంగా టార్గెట్ చేస్తున్నాయి. ఉద్యోగాల విషయంలో ఇంతకాలం కేవలం సర్కారు మాత్రమే డ్రామాలు చేసిందని భావించిన వారంతా ఇప్పుడు చక్రపాణిని సైతం టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఘంటా రాజీనామా చేయాలన్న డిమాండ్ రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తోంది. ఇక తెలంగాణ జెఎసి కూడా చక్రపాణి విషయంలో సాఫ్ట్ కార్నర్ తో లేకుండాపోతున్నది. సర్వీసు కమిషన్ తప్పిదాలు కూడా ఉన్నాయన్న భావనలో జెఎసి ఉంది. వీటన్నిటికి తోడు చీటికి మాటికి కోర్టు మొట్టికాయలు వేస్తుండడం చూసినా అందులోనూ చక్రపాణికి నష్టమే కలుగుతోంది.

మొత్తానికి మేధావిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా ఎంతో ఎత్తుకు ఎదిగిన ఘంటా చక్రపాణి తెలంగాణ రాష్ట్రంలో పబ్లిక్ సర్వీసు కమిషన్ ఛైర్మన్ గా అపఖ్యాతిని మూటగట్టుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. పేరుకు అన్ని అధికారాలున్నట్లు కనబడుతున్నా... ఏమీ చేయలేని నిస్సహాయుడిగా మిగిలిపోతున్న పరిస్థితి ఉంది. సోషియాలజీ చదివి సోషియాలజీ బోధించినా ఆయన రాజకీయ వ్యూహాల్లో బంధీ అయిపోయిండన్న ప్రచారం సాగుతున్నది. మరి ఘంటా ఈ సుడిగుండంలోంచి ఎలా బయటపడతాడన్నది ఇప్పుడు అందరి ముందున్న ప్రశ్న.
