టికెట్ల కేటాయింపులో మొండిచేయి : బీజేపీకి షాక్ .. వ్యతిరేక ప్రచారానికి సిద్ధమవుతోన్న గంగపుత్రులు
త్వరలో జరగనున్న తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో వుంచుకుని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తన అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేయకముందే తెలంగాణలోని గంగపుత్ర సంఘం బీజేపీపై అసంతృప్తిని వ్యక్తిని చేసింది.
త్వరలో జరగనున్న తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో వుంచుకుని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తన అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేయకముందే తెలంగాణలోని గంగపుత్ర సంఘం బీజేపీపై అసంతృప్తిని వ్యక్తిని చేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023కి సంబంధించి 35 మంది అభ్యర్ధులతో కూడిన మూడో జాబితాను గురువారం బీజేపీ విడుదల చేసింది. మల్కాజిగిరి నియోజకవర్గంలో గంగపుత్ర సామాజిక వర్గానికి చెందిన పూజ రాజుకు మాత్రమే బీజేపీ టికెట్ కేటాయించింది. తెలంగాణలో 18 లక్షలకు పైగా వున్న ఈ కమ్యూనిటీ .. ఓబీసీ కేటగిరీలోకి వస్తుంది. అంతేకాదు..ఓబీసీలలో అత్యధిక జనాభా కలిగిన కమ్యూనిటీలలో ఐదవ లేదా ఆరవ స్థానంలో వుంది.
హైదరాబాద్ పరిధిలో రెండు స్థానాలను తమకు కేటాయించాలని గంగపుత్ర సంఘం బీజేపీని కోరింది. ఉప్పల్, ముషీరాబాద్, మల్కాజ్‌గిరిలలో ఈ కమ్యూనిటీ ఎక్కువ. జీహెచ్ఎంసీతో పాటు కరీంనగర్ జిల్లాలో గంగపుత్ర సామాజిక వర్గం గణనీయంగా వుంది. తెలంగాణలో 25 సెగ్మెంట్లలో అభ్యర్ధుల గెలుపొటములను ఈ కమ్యూనిటీ నిర్దేశించగలదు. అయితే ఈ సంఘ ప్రతిపాదలను ఎంపీ బండి సంజయ్ వ్యతిరేకించినట్లుగా తెలుస్తోంది. బీజేపీ తీరుపై తీవ్ర అసంతృప్తితో వున్న గంగపుత్రులు.. హైదరాబాద్, కరీంనగర్ జిల్లాల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఇంటింటి ప్రచారం చేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం ఆయా ప్రాంతాల్లో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్ధులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం వుంది.
గంగపుత్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ మాట్లాడుతూ.. సికింద్రాబాద్, ఉప్పల్, మల్కాజిగిరి , అంబర్‌పేట్ అసెంబ్లీ స్థానాల్లో తమ వర్గానికి టికెట్లు కేటాయించాలని అడిగామన్నారు. ఈటల రాజేందర్, కిషన్ రెడ్డి తదితర నేతలకు వినతి పత్రాలు సమర్పించినా.. స్పందన లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.