ఒకరిని చంపడానికి ప్లాన్ వేశారు.. కానీ.. పొరపాటున మరొకరిని చంపేశారు. ఈ దారుణ సంఘటన బాలాపూర్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. షాహిన్ నగర్ వాది ఎ ముస్తఫాలో ఉండే షాహిన్ సయ్యద్ మోమిన్ అలి(24) మంగళవారం రాత్రి తన మిత్రుడు ఫరాన్ ఇంట్లో ఉన్నాడు. బుధవారం తెల్లవారుజామున ఆకలిగా ఉందని ఫరాన్ అనడంతో.. మోమిన్ అలి మరో వ్యక్తి ఖాలెద్ తో కలిసి ద్విచక్రవాహనంపై బయటకు వెళ్లాడు.

అయితే.. నలుగురు యువకులు చీకట్లో వారు వెళ్తున్న బైక్ ని అడ్డుకొని మోమిన్ అలి పై దాడి చేశారు. కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశాడు. హత్య అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. కాగా... పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయం తెలిసింది.

నిందితులంతా ఫరాన్ ని చంపేందుకు ప్లాన్ వేశారు. బైక్ ని గుర్తించి దాడి చేశారు. అయితే.. నిజానికి వాళ్లు చీకట్లో మోమిన్ నుంచి ఫరాన్ గా భావించి హత్య చేసినట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది.  ఫరాన్ ఓ వ్యక్తిని నమ్మించి దాదాపు రూ.18లక్షలు దోచుకున్నాడు. ఈ క్రమంలో అతనిపై పగబట్టి.. చంపాలని ప్లాన్ వేశారు. కానీ వీరి పగలో.. అమాయకుడైన మోమిన్ బలికావడం గమనార్హం.