Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్‌లో రెండో రోజు కొనసాగుతున్న గణేష్ నిమజ్జనం.. అబిడ్స్ వ‌ర‌కు బారులుతీరిన గ‌ణ‌నాథులు..

హైదరాబాద్‌ ట్యాంక్ బండ్ వద్ద రెండు రోజు గణేష్ నిమజ్జనం కొనసాగుతుంది. హైదరాబాద్ నలుమూలల నుంచి నిమజ్జనానికి భారీగా గణేష్ విగ్రహాలు తరలివస్తున్నాయి. అబిడ్స్ వ‌ర‌కు గ‌ణ‌నాథులు బారులు తీరాయి.

ganesh immersion continues in hyderabad on second day
Author
First Published Sep 10, 2022, 9:30 AM IST

హైదరాబాద్‌ ట్యాంక్ బండ్ వద్ద రెండు రోజు గణేష్ నిమజ్జనం కొనసాగుతుంది. హైదరాబాద్ నలుమూలల నుంచి నిమజ్జనానికి భారీగా గణేష్ విగ్రహాలు తరలివస్తున్నాయి. అబిడ్స్ వ‌ర‌కు గ‌ణ‌నాథులు బారులు తీరాయి. ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్, సంజీవ‌య్య పార్క్, ట్యాంక్ బండ్ రోడ్ల‌పైకి గ‌ణ‌నాథుల‌ను త‌ర‌లిస్తున్నారు. వేగంగా నిమజ్జనం పూర్తయ్యేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఈ రోజు రాత్రి వరకు నిమజ్జన ప్రక్రియ  పూర్తయ్యే అవకాశం ఉంది. మరోవైపు సాధారణ వాహనదారులకు ఇబ్బంది లేకుండా పోలీసులు చర్యలు చేపడుతున్నారు. ఉదయం 10 గంటల తర్వాత తెలుగుతల్లి ఫ్లైఓవర్‌పైకి వాహనాలకు అనుమతిచ్చే అవకాశం ఉంది. 

ఇక, శుక్రవారం ఉదయం హుస్సేన్ సాగర్‌లో భారీగా గణేష్ విగ్రహాల నిమజ్జన ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గణేష్ నిమజ్జనోత్సవాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో ట్యాంక్ బండ్ పరిసరాలు సందడిగా మారాయి. గణేష్ శోభాయాత్ర సాగుతున్న మార్గం.. జై బోలో గణేష్ మహారాజ్.. నినాదాలతో మారుమోగుతుంది.  రాత్రి 7 గంటల సమయంలో ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం పూర్తయింది. ఖైరతాబాద్ నుంచి ఎన్టీఆర్ మార్గ్‌ వరకు శోభాయాత్ర నిర్వహించి.. అనంతరం ట్యాంక్ బండ్‌లోని క్రేన్ నంబర్ 4 వద్ద మహాగణపతిని నిమజ్జనం చేశారు. దాదాపు 20 కి.మీ దూరం నుంచి శోభాయాత్ర హుస్సేన్ సాగర్‌కు చేరుకున్న బాలాపూర్ గణేష్ విగ్రహాన్ని రాత్రి 10.32 గంటలకు క్రేన్ నంబర్ 6 వద్ద నిమజ్జనం చేశారు. అనంతరం మిగిలిన గణనాథుల నిమజ్జన ప్రక్రియ వేగవంతమైంది. 

నిమజ్జనం శాంతియుతంగా జరిగేందుకు జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, హెచ్‌ఎంబీడబ్ల్యూ అండ్‌ ఎస్‌బీ, హైదరాబాద్‌, సైబరాబాద్‌ పోలీసులు, అగ్నిమాపక దళం, ఎస్‌ఆర్‌పీఎఫ్‌ (స్టేట్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌) సహా వివిధ విభాగాలకు చెందిన 50 వేల మంది అధికారులను మోహరించారు. ఏదైనా అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు, రెండు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డిఆర్‌ఎఫ్) బృందాలు, 38 ఫైర్ టెండర్లు, 12 బోట్లు, 10 మంది ఈతగాళ్లను మోహరించారు. ఇక, నిమజ్జనం జరిగిన వెంటనే విగ్రహ అవశేషాలను తొలగించడానికి హెచ్‌ఎండీఏ 1,000 మంది కార్మికులను విధుల్లో ఉంచింది. 

హుస్సేన్ సాగర్‌తో పాటు.. కాప్రా చెరువు, సరూర్‌నగర్‌ చెరువు, రాజన్న బావి, మీర్‌ ఆలం ట్యాంక్‌, ప్రగతినగర్ చెరువు, సురారం చెరువు.. తదితర ప్రాంతాల్లో గణేష్ నిమజ్జనం చేపట్టారు. హైదరాబాద్, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో గణేష్ శోభాయాత్రను.. రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయం నుంచి డీజీపీ మహేందర్ రెడ్డి  నిశితంగా పరిశీలించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios