సామాన్యంగా వస్తువుల ధరల పెంపు సామాన్యుడికి భారంగా మారుతుంటుంది. కానీ ఈ సారి ఆ పెంపు లంభోధరున్ని కూడా వదల్లేదు. ఓ తెలుగు సినిమా పాటలో ''ఆకాశం నుండి దిగివస్తూ మీతో పాటు ధరలను కూడా నేలకు తీసుకురావాలి వినాయకా'' అంటూ హీరో పాడుకుంటాడు. అయితే ఆ ధరల పెంపును తగ్గించడం మాట అటుంచి ఆయనే దానికి బాధితుడిగా మారిపోయాడు.ఆ దేవదేవుడిపైనే ఈ ధరల పెంపు భారం పడింది.  

తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో వినాయక చవితి అంటే ముందుగా గుర్తొచ్చేది ఖైరతాబాద్ వినాయకుడు. భక్తులు కోరిన కోర్కెలు తీర్చే ఈ ఖైరతాబాద్ గశేషుడిని చూడటానికి ఇరు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా వేరే రాష్ట్రాల నుండి భక్తులు వస్తుంటారు. అలాగే రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రితో పాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులు కూడా వినాయక చవితి సందర్భంగా ఈ వినాయకున్ని దర్శించుకుంటుంటారు. ఇందుకోసం నిర్వహకులు, ఉత్సవ కమిటీ సభ్యలు వినాయక విగ్రహాన్ని భారీ ఎత్తులో, సరికొత్త రూపంలో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తుంటారు. అలాగే ఈ ఏడాది కూడా ఖైరతాబాద్ లో సప్తముఖ కళా సర్ప మహాగణపతిని ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. 

అయితే ఈ సారి ధరల పెంపు ప్రభావం ఈ విగ్రహ తయారీపై పడింది. ప్రతి సంవత్సరం ఈ విగ్రహానికి రూ. 50 లక్షల నుండి రూ.60  లక్షల వరకు ఖర్చవుతుండగా, ఈ సంవత్సరం మాత్రం ఆ ఖర్చు రూ.80 లక్షలు దాటుతోందని నిర్వహకులు చెబుతున్నారు. సాధారణంగా అన్ని వస్తువులతో పాటే విగ్రహ తయారీకి అవసరమయ్యే వస్తువుల ధరలు పెరగడంతో ఈ వ్యయం పెరిగిందని తెలిపారు.  

ఈ ఒక్క విగ్రహమే కాదు...సాధారణ విగ్రహాల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. విగ్రహాల తయారీకి వాడే ప్లాస్టర్ ఆఫ్ పారిస్, వెదురు, ఇనుము, రంగుల ధరలు పెరగడంతో విగ్రహాల ధరలు పెరిగే అవకాశం ఉందని విగ్రహ తయారీదారులు చెబుతున్నారు.