దేశ వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు అట్టహాసంగా మొదలైన విషయం తెలిసిందే. వెరైటీ గణనాథులు ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఓ వినాయకుడి విగ్రహం కాంట్రవర్సీకి కేరాఫ్‌గా మారింది. వివరాల్లోకి వెళితే..
రేవంత్ రెడ్డి ఆకారంలో వినాయకుడు
హైదరాబాద్ హబీబ్‌నగర్‌లోని బోహిగూడ ప్రాంతంలో గణేశ్ మండపంలో ఏర్పాటు చేసిన విగ్రహం వివాదాస్పదమైంది. ఈ విగ్రహాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఆకారంలో తయారు చేయడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
డీసీపీ ఆదేశాలతో తొలగింపు
దక్షిణ పశ్చిమ డీసీపీ చంద్రమోహన్ శుక్రవారం (ఆగస్టు 29) అక్కడికి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్‌కి విగ్రహాన్ని తొలగించి మరోదానితో భర్తీ చేయాలని ఆదేశించారు. భక్తుల అభ్యంతరాల కారణంగానే ఈ చర్య తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఎమ్మెల్యే రాజాసింగ్ అభ్యంతరం
ఈ ఘటనపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. గురువారం ఆయన ఈ విషయాన్ని గమనించి హైదరాబాదు పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌కు లేఖ రాశారు. రేవంత్ రెడ్డి సీఎం అయినప్పటికీ ఆయన దేవుడు కాదని, ఈ విధమైన ప్రతిరూపం హిందూ సమాజానికి అవమానకరంగా ఉందని పేర్కొన్నారు.
ధార్మిక విశ్వాసాలపై గౌరవం అవసరం
రాజాసింగ్ తన లేఖలో “ముఖ్యమంత్రికి గౌరవం ఇవ్వడం వేరే విషయం. కానీ దేవుడి రూపంలో చూపించడం తప్పు. ఇది హిందూ భక్తుల భావాలను దెబ్బతీస్తోంది” అని రాశారు. తక్షణ చర్యలు తీసుకోవాలని, ధార్మిక సామరస్యాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు.
విగ్రహం మార్పు
పోలీసుల ఆదేశాల ప్రకారం వివాదాస్పద విగ్రహాన్ని తొలగించి కొత్త గణేశ్ విగ్రహాన్ని అక్కడ ప్రతిష్టించారు. దీంతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడింది.
