మన దేశవ్యాప్తంగా జరుపుకునే పండగల్లో వినాయక చవితి ఒకటి. ఈ పండగ వచ్చిందంటే చాలు... చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అందరూ సందడి చేయడం మొదలుపెడతారు. అన్ని పండగలు ఎవరికి వారు ఇళ్లల్లో జరుపుకుంటే ఒక్క వినాయక చవితి మాత్రం అందరితో కలిపి జరుపుకుంటారు. వీధి, వీధికీ విభిన్న రూపాలు, రంగులతో, మట్టితో చేసిన వినాయకులను ప్రత్యేకంగా మండపాలు ఏర్పాటు చేసి మరీ అందులో ఉంచుతారు.

వినాయక చవితి రోజు నుంచి 9 రోజుల పాటు నిష్టగా పూజలు చేసి... ఆ తర్వాత అంతే వైభవంగా నిమజ్జనం చేస్తారు. అయితే... కొందరు మాత్రం మూడో రోజు నుంచే నిమజ్జన కార్యక్రమాలు మొదలుపెట్టేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా హైదరాబాద్ నగరంలో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలి రానుండటంతో రక్షణ ఏర్పాట్లలో తలమునకలయ్యారు.

బుధవారం నుంచి గణేశ్ నిమజ్జన కార్యక్రమానికి భక్త జనులు సిద్ధమైపోయారు. చివరగా 12వ తేదీన నిమజ్జనం ముగియనుంది. ఖైరతాబాద్ పెద్ద గణేశుడి నిమజ్జనం కూడా చివరి రోజు జరగనుంది. అన్ని విగ్రహాలు చివరి రోజు నిమజ్జనం చేయడం అంటే చాలా కష్టంతో కూడుకున్న పని. అందుకే దాదాపు చిన్న వినాయక విగ్రహాలు, కాస్త మీడియం సైజు విగ్రహాలకు నిమజ్జన కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఈ మూడు రోజులు నిష్టగా పూజలు చేసి... మళ్లీ వచ్చే పండగకు మళ్లీ కలుద్దామంటూ గణేషునికి భక్తులు వీడ్కోలు పలుకుతున్నారు. 

ఇంకొందరు ఐదో రోజు కూడా నిమజ్జనం చేస్తుంటారు. ఇక భారీ విగ్రహాలను మాత్రం తొమ్మిదో రోజు వరకు ఉంచి ఆ తర్వాతే నిమజ్జనం చేయనున్నారు. 
ఈ నేపథ్యంలో నగర పోలీస్‌ శాఖ అలర్టైంది. నిమజ్జనం శాంతియుతంగా జరిగేలా భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. అసాంఘిక శక్తులు రెచ్చిపోకుండా నిఘా పెంచారు. సిటీ అంతటా దాదాపు 250 ప్రాంతాల్లో వాచ్ టవర్లు ఏర్పాటు చేశారు. మూడు కమిషనరేట్ల పరిధిలోని పోలీస్ సిబ్బందికి స్టాండ్ టు ప్రకటించారు. ప్రతి ఒక్కరూ కచ్చితంగా డ్యూటీలో ఉండే విధంగా ఆదేశాలు జారీ చేశారు ఉన్నతాధికారులు.