నిర్మల్: నిర్మల్ జిల్లా  కడెం మండలం ఉడుంపూర్ అటవీశాఖ కార్యాలయంపై గండిగోపాల్ పూర్ గ్రామస్తులు  మంగళవారం నాడు దాడికి దిగారు.ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది.

నర్సయ్య సోమవారం నాడు అడవిలో మేకలు మేపుతున్న సమయంలో అటవీశాఖాధికారులు అతడిని అదుపులోకి తీసుకొన్నారు. అతడిపై కొట్టినట్టుగా కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. 

మంగళవారం నాడు ఉదయం నర్సయ్యను అటవీశాఖాధికారులు వదిలిపెట్టారు. ఊట్నూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నర్సయ్య ఇవాళ మరణించాడు. నర్సయ్య మృతి చెందడానికి అటవీశాఖాధికారులే కారణమని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

also read:కరోనా రోగులకు డాక్టర్ ఫ్యామిలీ సేవలు: తల్లీదండ్రులతో కలిసి కొడుకు ట్రీట్‌మెంట్

నర్సయ్య మరణించిన విషయం తెలుసుకొన్న కుటుంబసభ్యులు, గ్రామస్తులు మూకుమ్మడిగా అటవీశాఖ కార్యాలయానికి వచ్చారు. అటవీశాఖ జీపును రోడ్డుపై పడేశారు.  కార్యాలయంలోని ఫర్నీచర్ ను బయటకు తీసుకొచ్చి ధ్వంసం చేశారు. ఫర్నీచర్ ను ముక్కలు ముక్కలుగా గొడ్డలితో నరికారు. 

విషయం తెలుసుకొన్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొన్నారు. నర్సయ్య మృతికి కారణం అటవీశాఖాధికారులు కొట్టిన దెబ్బలా ఇతరత్రా కారణాలు ఏమైనా ఉన్నాయా అనే విషయం పోస్టుమార్టం రిపోర్టులో తేలనుందని పోలీసులు చెబుతున్నారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని సిర్పూర్ కాగజ్ నగర్ లో డీఎఫ్ఓ అనితపై ఎమ్మెల్యే సోదరుడు కృష్ణతో పాటు గ్రామస్తులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనను అప్పట్లో ప్రభుత్వం సీరియస్ గా తీసుకొంది. ఎమ్మెల్యే సోదరుడితో పాటు ఆయన అనుచరులపై కేసులు పెట్టారు.

తమ భూముల్లో అటవీశాఖాధికారులు మొక్కలు నాటేందుకు ప్రయత్నించడంతోనే ఈ గొడవ ప్రారంభమైందని గ్రామస్తులు ఆరోపించారు.  ఈ ఘటన అప్పట్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.