గాంధీ ఆసుపత్రిలో కాలం చెల్లిన మందులను పేషెంట్లకు ఇవ్వడం కలకలం రేపింది. దీనిపై గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ స్పందించారు. స్టోర్‌లోనూ కాలం చెల్లిన మందుల నిల్వలు లేవని.. సెక్యూరిటీ దాటి లోనికి ఎవరూ వచ్చే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు
కాలం చెల్లిన మందుల వ్యవహారంపై గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ స్పందించారు. తమ దగ్గర కాలం చెల్లిన మందులు లేవని ఆయన స్పష్టం చేశారు. రోగుల దగ్గరికి కాలం చెల్లిన మందులు ఎలా వెళ్లాయో అర్ధం కావడం లేదన్నారు. కాలం చెల్లిన మందులు రోగులకు ఎవరిచ్చారనే దానిపై విచారణ చేపట్టామని ఆయన ప్రకటించారు. 48 గంటల్లోగా నివేదిక వస్తుందని.. చర్యలు తీసుకుంటామని సూపరింటెండెంట్ తెలిపారు. స్టోర్‌లోనూ కాలం చెల్లిన మందుల నిల్వలు లేవని.. సెక్యూరిటీ దాటి లోనికి ఎవరూ వచ్చే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. మెడిసిన్ స్టోర్‌కు పకడ్బందీ భద్రత ఏర్పాటు చేశామని సూపరింటెండెంట్ పేర్కొన్నారు.
అంతకుముందు గాంధీ ఆసుపత్రిలో కాలం చెల్లిన మందులను పేషెంట్లకు ఇవ్వడం కలకలం రేపింది. 2021లో గడువు తీరిన ఇన్సులిన్ మందులను పేషెంట్లకు ఇచ్చారు. అయితే దీనిని గమనించి రోగులు పై అధికారులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగుచూసింది. ఈ నేపథ్యంలో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది. అయితే శాంపిల్స్ వెనుక డ్రగ్ మాఫియా హస్తం వుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విచారణ అనంతరం నివేదిక వస్తే కానీ అసలు నిజాలు వెలుగు చూడవు.
