కుమార్తె వివాహం  సందర్భంగా చేస్తున్న ఆర్భాటాలను గమనించిన తర్వాత అటు భారతీయ జనతా పార్టీ, ఇటు కాంగ్రెస్ పార్టీలు వివాహానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాయి.

గాలి జనార్ధనరెడ్డి కుమార్తె బ్రహ్మణి వివాహానికి గ్లామర్ తగ్గిపోయినట్లే. దేశంలోనే సంచలనాత్మక రీతిలో కూతురు పెళ్ళి చేద్దామని మైనింగ్ కింగ్ గాలి జనార్ధనరెడ్డి అనుకున్నారు. అనుకోవటమే ఆలశ్యం అందుకు తగ్గట్లే ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. ఇందులో భాగంగానే వివాహ ఆహ్వాన పత్రికను పబ్లిక్ చూడటం కోసం వినూత్న రీతిలో విడుదల చేసారు. ఆ వివాహ ఆహ్వాన పత్రికను చూడ్డంతోనే గాలి స్టామినా ఏమిటో దేశవ్యాప్తంగా మరోసారి తెలిసి వచ్చింది.

ఇంతలో పెద్ద నోట్ల రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం గాలి ఇంట వివాహంపై పడిందని జనాల్లో చర్చలు మొదలయ్యాయి. ఎందుకంటే, కుమార్తె వివాహ ఏర్పాట్లకే సుమారు రూ. 500 కోట్లు ఖర్చు చేయనున్నట్లు బాగా ప్రచారం జరిగింది. సరే పెద్ద నోట్ల రద్దు ప్రభావం గాలి కుటుంబంపై ఉంటుందా ఉండదా అన్న చర్చ జరుగుతుండగానే అధికారంలో ఉన్న పార్టీలు తీసుకున్న నిర్ణయంతో గాలి ఇంట పెళ్లికి గ్లామర్ తగ్గిపోయేట్లు చేసింది.

 మైనింగ్ కేసుల్లో బైల్ పై బయట తిరుగుతున్న గాలి కుమార్తె వివాహం సందర్భంగా చేస్తున్న ఆర్భాటాలను గమనించిన తర్వాత అటు భారతీయ జనతా పార్టీ, ఇటు కాంగ్రెస్ పార్టీలు వివాహానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాయి. అసలే గాలి వివాదాస్పద వ్యాపారవేత్త. పై పెచ్చు కేసుల్లో ఇరుక్కుని బైలుపై బయట తిరుగుతున్నారు.

దానికి తోడు కుమార్తె వివాహానికి ఆయన పెడుతున్న వందల కోట్ల రూపాయల ఖర్చును చూసిన తర్వాత అటువంటి వ్యక్తుల ఇంట జరిగే కార్యక్రమాలకు హాజరైతే అనవసరంగా ప్రత్యర్ధులకు తామే ఆయుధాలను అందించినట్లు అవుతుందన్న ఉద్దేశ్యంతో అటు భాజపా ఇటు కాంగ్రెస్ నేతలు హాజరుకాకూడదని నిర్ణయించుకున్నారు. దాంతో గాలి కుమార్తె వివాహానికి ప్రముఖుల గ్లామర్ తగ్గిపోయినట్లే. లేకుంటే వివాహానికి ఆహ్వాన పత్రిక రావటమే పెద్ద స్టేటస్ సింబల్ గా పలువురు ఫీలవుతుంటే పత్రిక అందిన వారు హాజరుకాకుండా ఉంటారా ?