ప్రజాశాంతి పార్టీనుంచి గద్దర్ ను సస్పెండ్ చేస్తున్నట్లు కేఏపాల్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను రిలీజ్ చేశారు.
ప్రజాశాంతి పార్టీ నుంచి గద్దర్ సస్పెన్షన్‌కు గురయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ... రేవంత్ రెడ్డి మనల్ని విభజించి గెలవాలని చూస్తున్నాడన్నారు. జనాభాలో 90 శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, క్రిస్టియన్లందరూ ఇది తెలుసుకోవాలన్నారు. మోసపోవద్దని.. తెలుగు రాష్ట్రాలను కాపాడి అభివృద్ధి చేసేందుకు కుల రాజకీయాలకు అతీతంగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు.
ఇదిలా ఉండగా, గద్దర్ బుధవారం న్యూఢిల్లీలోని కేంద్ర ఎన్నికల కార్యాలయానికి వెళ్లారు. కొత్త రాజకీయ పార్టీ దిశగా పావులు కదిపే క్రమంలో భాగంగా ఆయన ఢిల్లీ చేరుకున్నారు. రాజకీయ పార్టీ రిజిస్ట్రేషన్ కోసం గద్దర్ ఎన్నికల అధికారులను కలిశారు. ఆ తరువాత మీడియాతో మాట్లాడారు.
ఢిల్లీలో ఎన్నికల అధికారులను కలిసిన గద్దర్.. కొత్త పార్టీ పేరు ప్రకటన..
తాను తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించారు. దీనికి ‘‘గద్దర్ ప్రజా పార్టీ’’ పేరును ఏర్పాటు చేయాలని.. దీనికోసమే ఢిల్లీకి వచ్చినట్టుగా చెప్పారు. పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ఎన్నికల అధికారులకు అప్లికేషన్ ఇచ్చానని తెలిపారు.

