హైదరాబాద్: ప్రజా వాగ్గేయకారుడిగా ప్రసిద్ధి పొందిన గద్దర్ కుమారుడు సూర్యం కాంగ్రెసు పార్టీలో చేరనున్నారు. గద్దర్ విప్లవోద్యమం నుంచి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణ ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అయితే, గద్దర్ కుమారుడు సూర్యం మాత్రం ప్రజా జీవితంలో కనిపించిన సందర్భాలు లేవనే చెప్పాలి.

కాగా, బిజెపికి రాజీనామా చేసిన నాగం జనార్దన్ రెడ్డి కూడా కాంగ్రెసు పార్టీలో చేరనున్నారు. పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో వాళ్లు రేపు (బుధవారం) ఉదయం పదకొండున్నర గంటలకు కాంగ్రెసులో చేరనున్నారు.

నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెసు పార్టీలో చేరుతారంటూ చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే, ఆయన రాకను కొంత మంది స్థానిక నేతలు అడ్డుకుంటున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.

నాగం జనార్దన్ రెడ్డి చేరికకు రాహుల్ గాంధీ లైన్ క్లియర్ చేసినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)ను ధీటుగా ఎదుర్కునేందుకు రాహుల్ గాంధీ చేరికలను ఆహ్వానిస్తున్నారు.