తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రిలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులకు పంపిణీ చేసే లడ్డూలు బూజు పట్టడం కలకలం సృష్టిస్తోంది. ఒక భక్తుడు ఇంటికి తీసుకెళ్లేందుకు లడ్డూను కొని బాక్స్ ఓపెన్ చేసి చూడగా... మొత్తం బూజు పట్టి కనిపించింది.

దీంతో అతడు వెంటనే అతడు విషయాన్ని ఆలయ అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. అప్రమత్తమైన అధికారులు సుమారు 30 ట్రేలలో ఉన్న 1800 లడ్డూలను పారబోశారు. వీటి విలువ రూ.60 వేలు ఉంటుందని అంచనా.. తయారీలో నాణ్యత లోపించడం, భద్రపరిచే చర్యల్లో లోపాల కారణంగా లడ్డూలు పాడై బూజు పట్టినట్లు అధికారులు భావిస్తున్నారు.

మరోవైపు గురు, శుక్ర వారాలల్లో భక్తుల రద్దీ తగ్గడం కూడా కారణమని తెలుస్తోంది. అయితే ఆలయ అధికారుల తీరుపై భక్తులు మండిపడుతున్నారు. పవిత్రమైన స్వామి వారి ప్రసాదాన్ని నిల్వ చేసే అంశంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ వారు ఆరోపిస్తున్నారు.